
రూ.వంద కోట్లతో శ్రీవారి ఆలయ అభివృద్ధి
వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పునఃనిర్మాణ పనులు
● రెండేళ్లలోపు పూర్తి చేస్తాం
● ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీశైలజా రామయ్యార్
కొడంగల్: పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ అన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా రెండేళ్లలోపు పునఃనిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, వాస్తు నిపుణులతో కలిసి శనివారం ఆమె కొడంగల్‌కు వచ్చారు. ముందుగా కడా కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ వెంకట్‌రావ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, వాస్తు నిపుణుడు సపతితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను పరిశీలించారు. దేవాలయ పునరుద్ధణకు సంబంధించిన వివరాలను వాస్తు శిల్పి సత్యనారాయణ మూర్తి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. డిజిటల్ స్క్రీన్‌పై అధికారులు వీక్షించారు. అనంతరం శైలజారామయ్యార్ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించారు. గోశాలను, మండపం, పుష్కరిణి, వరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన వెంచర్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయ అభివృద్ధి అనంతంర ఈ ఆప్రాంతం పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా కొడంగల్‌లోని ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. క్యూలైన్, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీడీఓ ఉషశ్రీ, ఆలయ ఈఓ రాజేందర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు నందారం శ్రీనివాస్, రత్నం, మధు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ పాల్గొన్నారు.
దౌల్తాబాద్ ఆలయ సందర్శన
దౌల్తాబాద్: దౌల్తాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యార్ అన్నారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు.