
దీపం కింద పడి ఇల్లు దగ్ధం
దౌల్తాబాద్: మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ఓ ఇల్లు దగ్ధమై రూ.2.50 లక్షల నగదు, 4 తులాల బంగారం కాలి బూడిదైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎర్రవిల్ల అనంతప్ప కుటుంబసభ్యులు శ్రావణమాస శనివారం కావడంతో ఇంట్లో దేవుడికి పూజ చేసి దీపం ముట్టించి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో నుంచి పొగలు రావడం చూసి చుట్టు పక్కల వారు పైనబండలు తీసి మంటలు ఆర్పారు. ఇప్పటికే రూ.2.50 లక్షలు, 4 తులాల బంగారం మంటలకు కాలిపోయాయి. దీంతో కష్టపడి కూలి పనులు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కాలిపోవడంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. దేవుడి దీపం కిందపడడంతో ఇల్లు అంటుకుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాజుకుమార్, ఆర్‌ఐ సునీల్ పరిశీలించారు.
రూ.2.50 లక్షలు, 4 తులాల బంగారం బూడిద