కొనసాగుతున్న జోనల్‌ స్థాయి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న జోనల్‌ స్థాయి ఎంపిక

Aug 3 2025 8:54 AM | Updated on Aug 3 2025 8:54 AM

కొనసాగుతున్న జోనల్‌ స్థాయి ఎంపిక

కొనసాగుతున్న జోనల్‌ స్థాయి ఎంపిక

ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌కు 18 మంది

బషీరాబాద్‌: తాండూరు జోనల్‌ క్రీడాకారుల ఎంపిక బషీరాబాద్‌ బాలుర పాఠశాల మైదానంలో కొనసాగుతున్నాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఎంపిక చేస్తున్నారు. శనివారం అండర్‌ 14లో 200 మంది హాజరుకాగా, వీరిలో 18 మందిని జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపిక చేసినట్లు పీడీ అంబదాస్‌ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు నెల రోజుల శిక్షణానంతరం జిల్లా స్థాయికి పంపుతామన్నారు. అయితే ప్రభుత్వం క్రీడాకారులకు మొదటి రోజు భోజన సౌకర్యం కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం బషీరాబాద్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ జయ్‌రామ్‌ చారి 200మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు అనంతయ్య, శివ, రాజు, రవీందర్‌ రెడ్డి, విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాత్‌రూంలో జారిపడి వలస కూలీ మృతి

మొయినాబాద్‌: బతుకు దెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ బాత్‌రూంలో జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన బంటి(27) అదే ప్రాంతానికి చెందిన పుష్పేందర్‌, గుజార్‌తో కలిసి మూడు నెలల క్రితం మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌కు వలస వచ్చారు. గ్రామ సమీపంలోని పైప్‌లైన్‌ రోడ్డులో ఉన్న అవసా విల్లాలో టైల్స్‌, మార్బుల్స్‌ పనిచేస్తూ అక్కడే ఓ గదిలో ఉంటున్నారు. కాగా శుక్రవారం రాత్రి 8 గంటలకు భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంటి బాత్‌రూంకు వెళ్లి అందులో జారి పడ్డాడు. అతని తలకు గాయమైంది. అతనితో ఉన్నవారు నీళ్లు తాగించి పడుకోబెట్టారు. ఉదయం 6 గంటలకు బంటిని నిద్రలేపినా లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ల పట్టివేత

కడ్తాల్‌: పరిమితికి మించి ఓవర్‌లోడ్‌తో రవా ణా చేస్తున్న రెండు టిప్పర్లను ఆర్టీఏ అధికారులు పట్టుకున్న సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఆర్టీఏ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే మున్ని ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌తో పాటు, ఓవర్‌లోడ్‌తో కంకరపొడిని తరలిస్తున్న మరో వాహనాన్ని సీజ్‌ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీఏ కానిస్టేబుల్‌ జగన్‌, సిబ్బంది ఉన్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

కేశంపేట: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంతాపూర్‌ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాలాల రాకేష్‌(40) మేసీ్త్ర పనులు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన గ్రామానికి చెందిన లేగలకాడి శ్రీనుతో కలిసి శివారులోని నాగుల చెరువులో చేపల వేటకు వెళ్లారు. రాకేష్‌ మద్యం మత్తులో ఉండటంతో చెరువులో పడిపోయాడు. ఆయన్ని రక్షించేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా విఫలమయ్యాయి. అనంతరం మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాంచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement