
దూసుకొచ్చిన మృత్యువు
డీసీఎం ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి
పరిగి: సంతలో కూరగాయలు విక్రయించి ఇంటికి వెళ్తున్న దంపతులకు డీసీఎం మృత్యుపాశంగా మారింది. బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన శనివారం పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొనింటి లక్ష్మి(33), వెంకటయ్య(42) భార్యాభర్తలు. ఇద్దరూ నిత్యం సంతలో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శనివారం పరిగి సంత కావడంతో కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చి సాయ ంత్రం ఇంటికి బైక్‌పై బయలు దేరారు. మార్గమధ్యలో సుల్తాన్‌పూర్ గేట్ దగ్గర వెనుక నుంచి వచ్చిన డీసీఎం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా వెంకటయ్య అపస్మరకస్థితిలోకి వెళ్లాడు. ఆయన్ని చికిత్స నిమిత్తం వికారాబాద్‌కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచాల మండలం కాగజ్‌ఘాట్ గ్రామానికి చెందిన శివ యాచారం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జూలై 29న ఆయన భార్య సుజాత(42) శివను కలవడానికి యాచారానికి వచ్చింది. ఇద్దరు కలిసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో యాచారం ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో సుజాత బైక్‌పై నుంచి జారి పడి పోయింది. తీవ్ర గాయాలైన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని
కూలీ దుర్మరణం
మహేశ్వరం: బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మహేశ్వరం గేటు సిరిగిరిపురం అర్బన్ ఫారెస్టు వద్ద చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిగిరిపురం గ్రామానికి చెందిన తడకల బాలకృష్ణ(40) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన శనివారం సాయంత్రం మహేశ్వరం గేటు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా అర్బన్ ఫారెస్టు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవ్వడంతో బాలకృష్ణ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టా రు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
బంగారం అపహరణలో కేసు నమోదు
నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లిలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య ఇంట్లో రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన విషయం విధితమే. బాధితుడు కృష్ణయ్య గత నెల 27న ఇంట్లో దాచిన బంగారం, నగదు కనబడక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.