
బాల కార్మికులకు విముక్తి
తాండూరు రూరల్: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా తాండూరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న 54 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినట్లు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం తెలిపారు. గురువారం మండలంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. 54 మంది బాల కార్మికులను గుర్తించామని, ఇందులో ఏడుగురు బాలికలు, 15 మంది ఇతర రాష్ట్రాల చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. 11 మంది షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెలేర్ కమిటీ సభ్యులు ప్రకాష్, సంగమేశ్వర్, ఎస్‌ఐ గిరి, లీగల్ ఆఫీసర్ నరేష్‌కుమార్, కౌన్సిలర్ లక్ష్మణ్, సూపర్‌వైజర్ ఆనంద్, స్వచ్ఛంద సంస్థ నాయకురాలు అంకిత, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు బస్వరాజ్, సంతోష్, మమత, కార్మిక శాఖ అధికారి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్
54 మంది చిన్నారుల గుర్తింపు
జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం