
బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు
● సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్ ● బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల తీరుపై ఆగ్రహం
తాండూరు టౌన్: బీసీ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు పాసై, గవర్నర్ వద్ద ఆమోదం కోసం ఎదురు చూస్తోందన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ, కేవలం 29శాతం విద్య, ఉద్యోగాల్లో, 21శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు వెనకాడిన ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌ను విమర్శిస్తోందన్నారు. బీసీ కులగణన వివరాలను, సర్వే డాటాను ప్రజలకు అందుబాటులో పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలైతే ముస్లింలు లాభపడతారని బీజేపీ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ఇలా ప్రతి రాజకీయ పార్టీ వారి స్వప్రయోజనాల కోసం వ్యవహరించకుండా, ఏకతాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.