
ఇందిరమ్మకు ఇసుక గండం
దోమ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సీఎం రేంవత్‌రెడ్డి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన విషయం విధితమే. కానీ దోమ మండల అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక పర్మిషన్ కోసం టోకెన్ ఇవ్వాలని తహసీల్దార్ వద్దకు వెళితే.. అనుమతి లేదంటూ తిప్పిపంపిస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీంతో లబ్ధిదారులకు ఇసుక దొరకక ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. అధికారులు మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఈ ఊరికి మొత్తం 185 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 96 ఇళ్లు పనులు జరుగుతుండగా 89 ఇండ్లు ప్రారంభానికి నోచుకోలేకపోయాయి. దీంతో పనులు చేసుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక సమస్య తలనొప్పిగా మారింది.
కాసులు దండుకుంటున్న దళారులు
మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైనంత ఇసుక దొరుకుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. దిర్సంపల్లి, మైలారం, గొడుగోనిపల్లి వాగులతో పాటు కాకారవాణి ప్రాజెక్టులో భారీ స్థాయిలో ఇసుక ఉంది. దాన్ని కొంత మంది వ్యాపారులు ట్రాక్టర్లలో పొలాల దగ్గరకు తెచ్చుకొని డంపులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ డంపులను అధికారులు పట్టుకోకపోవడం, అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఇష్టారీతిన అధిక రేట్లకు విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి రూ.5 లక్షలు కేటాయిస్తుంది. దీంట్లో స్టీల్, సిమెంట్, ఇటుకలు తెచ్చుకోవాల్సి ఉంది. వాటి ధరలు సైతం అధికంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చి ఇందిరమ్మ ఇళ్లకు అందించాలని అధికారులను ఆదేశించింది. కానీ ఽఅధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
డస్ట్‌తో కట్టుకుంటున్నాం
ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. పకడ్బందీగా నిర్మించుకుందామనుకుంటే ఇసుక దొరకలేని పరిస్థితి నెలకొంది. దీంతో డస్ట్‌తో ఇల్లు నిర్మించుకుంటున్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలని కోరితే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.
– బాలునాయక్, శివారెడ్డిపల్లితండా
ఎలాంటి ఆదేశాలు లేవు
ఇందిరమ్మ ఇళ్లయినా, మరే ఇతర అవసరాలకై నా ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తెచ్చుకునేందుకు టోకన్‌లను అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
– గోవిందమ్మ, తహసీల్దార్, దోమ
టోకెన్ అనుమతులు లేవంటున్న అధికారులు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు
ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన