
చెరవీడని సర్కారు భూమి!
బషీరాబాద్: ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి విడిపించాల్సిన అధికారులు చేతులెత్తేశారు. బషీరాబాద్– తాండూరు ప్రధాన రోడ్డుకు ఆనుకుని కాశీంపూర్ శివారులోని విలువైన సర్కారు భూమి అన్యాక్రాంతానికి గురైందని తేల్చినా స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. బషీరాబాద్, యాలాల, తాండూరు మూడు మండలాలను కలిపే శివారు కావడంతో కొన్నాళ్లు ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సమీప రైతులు ఇటీవల ఆందోళన వ్యక్తంచేయడం, పత్రికల్లో ఇందుకు సంబంధించిన కథనాలు రావడంతో స్పందించిన యంత్రాంగం గత నెల జూలై 10న సర్వేచేసింది. జుంటివాగు బ్యాక్‌వాటర్ నిలిచే నది ప్రాంతాన్ని మట్టితో పూడ్చేసిన అక్రమార్కులు 200 మీటర్ల పొడవున, ఐదు మీటర్ల మేర భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. దీనికి తోడు తాండూరు మండలం మాచనూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32/2లో సుమారు 20 గుంటల భూమి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించారు. అనంతరం యాలాల, తాండూరు రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు మరోసారి సంయుక్తంగా సర్వే చేశారు. కబ్జా వాస్తవమేనని తేల్చినప్పటికీ సర్కారు భూమిని మాత్రం చెర నుంచి విడిపించలేదు. ఇదిలా ఉండగా భూమిని చెరబట్టిన వ్యక్తులు ఇటీవల ప్రభుత్వ స్థలంలోనే ట్రాన్స్‌ఫార్మర్ బిగించారు. దీనికితోడు బషీరాబాద్– తాండూరు ప్రధాన రోడ్డు నుంచి వీరి పొలాల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వ భూమిని వారి సొంత స్థలంలా వినియోగిస్తున్నారు. ఇప్పటికై నా అక్రమార్కుల ఆట కట్టించి, ప్రభుత్వ భూమిని కాపాడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తప్పవు..
ఈవిషయమై యాలాల తహసీల్దార్ వెంకటస్వామిని వివరణ కోరగా.. జుంటివాగు కబ్జాపై ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సమగ్రంగా సర్వే చేశామన్నారు. తాండూరు మండల పరిధిలో 5 మీటర్ల మేర భూమి కబ్జాకు గురైనట్లు తేలిందని చెప్పారు. యాలాల పరిధిలోకి వచ్చే చెక్‌డ్యాం వెనకవైపున 200 మీటర్ల పొడవునా ఆక్రమించారని తెలిపారు. ఇక్కడ నిర్మిస్తున్న గది తాండూరు పరిధిలోకి వస్తుందన్నారు. ఆక్రమణకు గురైన స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటు భూమిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. మరోవైపు ఇరిగేషన్ డీఈ కిష్టయ్య మాట్లాడుతూ.. జుంటివాగు కబ్జాపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామన్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
కబ్జాకు గురైనట్లు తేల్చినా స్వాధీనం చేసుకోని వైనం
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు