
వామ్మో.. ఇదేం బస్టాండ్!
ఆవరణ మొత్తం చెత్తమయం
● ప్రయాణికులు కూర్చోలేని పరిస్థితి ● నిర్వహణను గాలికొదిలేసిన ఆర్టీసీ అధికారులు
ధారూరు: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ధారూరు బస్టాండ్ దారుణంగా తయారైంది. మేకలు, పందులు, కుక్కలు మలమూత్ర విసర్జన చేయడంతో ప్రయాణికులు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. బస్టాండ్ ఆవరణ మొత్తం కంపు కొడుతోంది. తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ దీని పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నా ఒక్కసారి కూడా పరిశీలించిన పాపానపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారూరుకు వస్తుంటారు. బస్టాండ్‌లో చెత్తాచెదారం వల్ల ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేక పోతున్నారు. వర్షాల కారణంగా ఆవరణ మొత్తం చిత్తడిగా మారింది. అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. బస్సులు సైతం బస్టాండులోకి రావడం లేదని ప్రయాణికులు తెలిపారు. రోడ్డుపైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, బస్సులు బస్టాండ్ లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.