
కూతురి పెళ్లికి దాచితే.. దోచేశారు!
నందిగామ: కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని మండలంలోని మామిడిపల్లికి చెందిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువైందని లబోదిబోమన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య కొందుర్గు మండలంలోని మహదేవ్‌పూర్‌లో ఉన్న భూమిని గతంలో విక్రయించాడు. వచ్చిన డబ్బులతో కొంత అవసరాల కోసం వాడుకున్నాడు. కూతురుకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో 16 తులాల బంగారాన్ని కొనుగోలు చేసి, రూ.15 లక్షల నగదును ఇంట్లో భద్రపరిచాడు. ఇటీవల రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో ఇంట్లో చూడగా నగదు, బంగారం కనబడకపోవడంతో లబోదిబోమన్నాడు. డబ్బులు, పసిడి దోచుకుపోయిన విషయమై కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో చర్చించాడు. ఎక్కడ నుంచి కనీస సమాచారం లేక పోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. గురువారం తిరిగి బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో సజ్జపై దాచిన డబ్బులను తెలిసిన వారే దోచుకుపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసు నమోదు చేయని పోలీసులు
మామిడిపల్లిలో ఇంత పెద్ద చోరీ జరిగినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ను వివరణ కోరగా.. బాధితులను విచారించామని, ఏసీపీ శుక్రవారం వస్తారని, మరోసారి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని చెప్పారు.
మామిడిపల్లిలో భారీ చోరీ
రూ.15 లక్షల నగదు, 16 తులాల బంగారం అపహరణ