ఐదు నియోజకవర్గాల పరిధిలో
పంచాయతీ ఎన్నికలు
19 మండలాల్లోని 237 సర్పంచ్ పదవులు
237 సర్పంచ్‌లకు 592 మంది
అభ్యర్థులు పోటీ
1,814 వార్డు సభ్యులకు బరిలో
3,832 మంది అభ్యర్థులు
ఇప్పటికే 136 సర్పంచ్‌లు,
1,712 వార్డులు ఎకగ్రీవం
ఉదయం 7గంటల నుంది మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలు వెల్లడి
తిరుపతి అర్బన్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 19 మండలాల పరిధిలోని 373 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో 373 సర్పంచ్ స్థానాలకు, 3,526 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే 136 సర్పంచ్ స్థానాలు, 1,712 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఆదివారం 237 సర్పంచ్ స్థానాలకు, 1,814 వార్డు సభ్యులకు ఎన్నిక జరగనుంది.
ఐదు నియోజకవర్గాల పరిధిలో పోలింగ్
జిల్లాలో ఆదివారం ఐదు నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 237 సర్పంచ్ స్థానాలకు 592 మంది అభ్యర్థులు, 1,814 వార్డు స్థానాలకు 3,832 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో 6 మండలాలు, చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాలు, వెంకటగిరి నియోజకవర్గంలో 3, మండలాలు, గూడూరు నియోజకవర్గంలోని 2 మండలాలు, నగరి నియోజకవర్గంలోని 2 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్
ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు.
ఐదు దశల్లో కుట్రలు
2 దశలు జయించారు.. ఇక 3 దశలు కీలకం
అధికార పార్టీకి చెందిన నేతలు పంచాయతీ ఎన్నికల్లో ఐదు దశల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తొలి దశ నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, రెండో దశ నామినేషన్ల పరిశీలనలో పత్రాలు చించివేయడం, మూడో దశ దొంగ ఓట్లు వేసుకోవడం, నాలుగో దశ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు చెల్లని ఓట్లుగా చూపించడం, ఓట్ల కట్టలను మాయం చేయడం, ఐదో దశ విజయం సాధించినప్పటికి ఫలితాన్ని వెల్లడించకుండా పెండింగ్ పెట్టి అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని పలెల్లో చర్చించుకుంటున్నారు. రెండు దశలు దాటామని, ఆదివారం ఓటింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి మూడు దశలను జయించాల్సి ఉందని మాట్లాడుకుంటున్నారు.
ఓటు హక్కును వినియోగించుకోండి
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శనివారం వెల్లడించారు. రెండో విడతో 4,16,148 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో 2,02,883 మంది పురుషులు, 2,13,225 మంది మహిళలు, 40 మంది ఇతరులు ఉన్నారని వివరించారు. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టంచేశారు. నిర్భయంగా తమ ఓటును వేసుకోవాలని ఆయన కోరారు.
– ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్


