ఆన్‌లైన్ నిబంధనతో శ్రీకాళహస్తిలో భక్తులకు చుక్కలు సగానికి పడిపోయిన ప్రసాదాల విక్రయాలు
శ్రీకాళహస్తి: శివపార్వతుల దర్శనానంతరం ప్రసాదం స్వీకరించడం హిందూ ఆలయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్‌న్‌లైన్ విధానం కారణంగా భక్తులు ప్రసాదం తీసుకోకుండానే ఆలయం నుంచి వెనుదిరుగుతున్నారు. ప్రసాదాలు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మొబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైనన్‌లో టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. చదువుకున్నవారు, డిజిటల్ విధానంపై అవగాహన ఉన్నవారే ప్రసాదాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వారికి శివయ్య ప్రసాదం అందని ద్రాక్షగా మారుతోంది.
దర్శనం తర్వాత మళ్లీ బయటకు!
శ్రీకాళహస్తికి రాహు–కేతు సర్పదోష నివారణ పూజలు, ముక్కంటి దర్శనం కోసం రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలోకి మొబైల్ ఫోన్ల అనుమతి లేకపోవడంతో భక్తులు ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న లాకర్లలో తమ సెల్‌ఫోన్లను భద్రపరుస్తున్నారు. పూజలు, దర్శనం పూర్తయ్యాక ప్రసాదం కోసం కౌంటర్ వద్దకు వెళ్లే సరికి ఆన్‌న్‌లైన్‌లో బుకింగ్ చేయాలని చెప్పడంతో మళ్లీ బయటకు వెళ్లి ఫోన్ తీసుకుని తిరిగి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఈ తిప్పలు పడలేక చాలామంది ప్రసాదం తీసుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
గణాంకాలే సాక్ష్యం
జూన్ 20న 42 వేల మంది భక్తులు దర్శించుకోగా ప్రసాదాల ద్వారా రూ.2,27,555 ఆదాయం వచ్చింది. చిన్న లడ్డూలు 5,699, పులిహోర 3 వేల ప్యాకెట్లు, వడలు 1,560 అమ్ముడయ్యాయి. జూన్ 21న 44 వేల మంది భక్తులు దర్శించుకోగా ప్రసాదాల ఆదాయం రూ.2,95,395కు పరిమితమైంది. చిన్న లడ్డూలు 9,045, వడలు 2,905, పులిహోర 5,318 విక్రయించారు. మే 22న 21 వేల మంది భక్తులువచ్చినప్పటికీ ప్రసాదాల ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం లభించింది. చిన్న లడ్డూలు 10,382, వడలు 2,646, పులిహోర 5,431 అమ్ముడయ్యాయి.
మిగిలిపోతున్న ప్రసాదాలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో లడ్డూ, వడ, జిలేబీలతో పాటు పులిహోరకు ప్రత్యేక ఆదరణ ఉంది. గతంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రసాదాలు పూర్తిగా అమ్ముడయ్యేవి. ఆన్‌లైన్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భక్తులు తగ్గకపోయినా ప్రసాదాల కొనుగోళ్లు మాత్రం గణనీయంగా పడిపోయాయి. పెద్ద మొత్తంలో ప్రసాదాలు మిగిలిపోతుండగా, ఆలయ ఆదాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.
ఆఫ్‌లైన్ విధానం కూడా అమలు చేయాలి
భక్తుల సౌకర్యాన్ని దష్టిలో ఉంచుకుని ఆన్‌న్‌లైన్‌తోపాటు ప్రసాదాల కౌంటర్ల వద్ద నగదుతో కొనేవిధంగా ఆఫ్‌లైన్ విధానంలో కూడా పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.


