వరదయ్యపాళెం: మండలంలోని సీఎల్‌ఎన్‌పల్లిలో రైతులు చెంగయ్య, మునెమ్మకు చెందిన రెండు గడ్డివాములు శుక్రవారం పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత రైతులు తెలిపిన మేరకు దగ్ధమైన గడ్డివాముల విలువ రూ. లక్షన్నరకు పైగా ఉంటుందని వాపోయారు. సత్యవేడు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన రేణిగుంట మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లికి చెందిన కే లక్ష్మీపతి నాయుడు (57) ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీకి వెళ్లేందుకు శుక్రవారం ఉదయం సుమారు 4.50 గంటల సమయంలో శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రధాన రహదారిలోని వెదళ్లచెరువు సమీపంలో ఉన్న ఉగాది హోటల్ వద్ద బస్సు ఎక్కేందుకు శ్రీకాళహస్తి వైపు నుంచి వస్తున్న ఏపీ40 జెడ్ 0509 నంబరు ఆర్టీసీ బస్సును ఆపడానికి ప్రయత్నించే సమయంలో వెనుక నుంచి టీఎన్ 52 ఏఎఫ్ 4088 నంబరు లారీ వచ్చి లక్ష్మీపతి నాయుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే లారీ బస్సును వెనుక నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఈనెల 27 నుంచి శ్రీసిటీలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 29 వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్య, నైపుణ్య, శారీరక శిక్షణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇరుగుళం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఈ శిబిరం నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే వారందరికీ భోజన, వాహన సదుపాయం కల్పిస్తారని చెప్పారు. క్యాంపులో చేరదలిచిన వారు 93987 33608ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన మండలంలోని ఊరందూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 26 నుంచి మే 6 బుధవారం వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శుక్రవారం తెలియజేశారు.
మందుబాబుకు జైలు
తిరుపతి లీగల్ : మద్యం తాగి వాహనం నడిపిన కేసులో కరకంబాడికి చెందిన కారు డ్రైవర్ టి.మోహన్‌కు 14 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తిరుపతి రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ కరీముల్లా మస్తాన్ తీర్పు చెప్పారు.


