సాక్షి..ప్రాణం పోసింది!
గూడూరురూరల్: ఓ యువకుడికి సాక్షి దినపత్రిక ప్రాణం పోసింది. గూడూరు పట్టణానికి చెందిన వెందోటి దిలీప్ అనే యువకుడు కీళ్ల వాతంతో బాధపడుతున్న విషయంపై 2017లో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ విషయం తెలుసుకున్న రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీనివాసులునాయుడు దిలీప్‌కు వైద్యం చేయించారు. నడవలేని స్థితిలో వీల్ చైర్‌లో ఉన్న దిలీప్‌కు ప్రతి ఆరు నెలలకొకసారి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో వైద్యం చేయించి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. నడవలేని స్థితిలో వీల్ ఛైర్‌లో ఉన్న దిలీప్ ప్రస్తుతం నడుస్తూ తన పని తాను చేసుకుంటూ చదువుకుంటున్నాడు. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.5లక్షల వరకు ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చులకు వెచ్చించడం జరిగింది.
డాక్టర్ జిలానీ అభియోగాలపై విచారణ
వెంకటగిరి రూరల్: వెంకటగిరి సీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యుడిగా వ్యవహరిస్తున్న డాక్టర్ జిలానీపై వచ్చిన అభియోగాలపై మంగళవారం విచారణ జరిపారు. వెంకటగిరి సీహెచ్‌సీలో వైద్యులు జిలానీతోపాటు, స్టాఫ్‌నర్సు, హెడ్‌నర్సు, ల్యాబ్ సిబ్బందిని మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గూడూరు ఏరియా వైద్యశాల సివిల్ సర్జన్ డాక్టర్ రాజా, ఏఓ కమల్‌కిరణ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా సివిల్ సర్జన్ డాక్టర్ రాజా మాట్లాడుతూ స్థానిక సీహెచ్‌సీలో ఇన్‌చార్జి డీడీఓగా వ్యవహరిస్తున్న జిలానీబాషాపై కిందస్థాయి వైద్యులను ఇబ్బందులు గురిచేశారని, దీంతో వారు ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని ఇతర ఆస్పత్రులకు వెళ్లారని, మరికొందరు స్థానిక వైద్యశాలలో పనిచేసేందుకు సుముఖత చూపడంలేదని విమర్శలు వచ్చాయన్నారు. జీడీఏగా వ్యవహరిస్తున్న ఆరుగురు జిలానీ పర్సనల్ వ్యక్తులగా వ్యహరిస్తుండడంతోపాటు, సర్టిఫికెట్లలో గెజిటెడ్ సంతకం కోసం వచ్చే ప్రజలు నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. పలు ఆరోపణలతో స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు కొందరు ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఈ వ్యవహారాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపామన్నారు. వైద్యుడు జిలానీతోపాటు కిందిస్థాయి సిబ్బందిని విచారించి వివరాలను రాతపూర్వకంగా, మౌకికంగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
సాక్షి..ప్రాణం పోసింది!
సాక్షి..ప్రాణం పోసింది!


