పోలీసుల ఎదుటే.. డిష్యుం..డిష్యుం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘‘ఆ భూమిపై ఎవరికీ హక్కు లేదు.. ఒకరు ఇల్లు కట్టారు.. మరొకరు అద్దెకు చేరారు.. అద్దెకు చేరిన వారు ఆ స్థలం తనదేనని భీష్మించుకోగా..ఆ స్థలం తమదేనని మరొకరు బలవంతంగా ఖాళీ చేయించడానికి వచ్చారు.. ఆ ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా పోలీసులు ఎదుటే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు.. ఏ సంబంధం లేని మఠం భూమి కోసం కొట్టుకోవడంతో పోలీసులు వారిని సర్దుబాటు చేసి, గొడవలు లేకుండా కట్టడి చేయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలోని హథీరాంజీ మఠం భూమిలో అద్దె పేరుతో ఓ ఇంట్లో చేరిన మహిళను ఖాళీ చేయించేందుకు కొందరు మహిళలు గుంపుగా వెళ్లడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. మొదట జుట్లు పట్టుకుని కొట్టుకోగా ఆ తరువాత రాడ్లతో దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గొడవలు లేకుండా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. అయినా సరే మహిళలు లెక్కచేయకుండా ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడడంతో పోలీసులు స్థానికుల సాయంతో వారిని నిలువరించాల్సి వచ్చింది. మఠం భూమిపై ఇరువర్గాల వారికి ఎలాంటి సంబంధం లేకున్నా ఆ భూమి తమదంటే తమదని గొడవలు చేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాల వారిని మందలించారు. మరోసారి గొడవలు చేసుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. అయితే ఆ భూమిని సొంతం చేసుకోవడానికి వచ్చిన పలువురు మహిళలు తిరుపతి రూరల్ పోలీసులు అద్దెకు వచ్చి రౌడీయుజం చేస్తున్న మహిళకు వంత పాడుతున్నారని, తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం.
భూమి కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
–బాధితులు సరోజినీదేవి, రాజేశ్వరరావు వేడుకోలు
తిరుపతి కల్చరల్: తమ స్థలంలో అద్దెకు చేరి ఆ స్థ లాన్నే దౌర్జన్యంగా కాజేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయా లని గాయత్రీనగర్‌కు చెందిన సరోజినీదేవి, డి.రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వా రు మాట్లాడారు. తుమ్మలగుంట రోడ్డులో 140 అంకణాల స్థలాన్ని కొనుగోలు చేసి, సుప్రీంకోర్టు ఆర్డర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. తమ స్థలంలో కొంత భాగం అద్దెకు ఇస్తే హ్యాండ్‌లూమ్ నడుపుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటానని యశోద అనే మహిళ కోరవడంతో అగ్రిమెంట్ కింద అద్దెకు ఇచ్చామని తెలిపారు. అంతేకాక ఆమె వారి పిల్లల చదువుల కోసమని త మ వద్ద నుంచి రూ.6 లక్షలు వడ్డీకి తీసుకొని ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. కాగా అద్దె చెల్లించక, స్థలాన్ని ఖాళీ చేయాలని కోరినా ఆమె తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ తమ స్థలంలోకి రానీ కుండా అడ్డుకుంటోందని వాపోయారు.
న్యాయం చేయండి
బతుకు తెరువు కోసం మగ్గాలు ఏర్పాటు చేసి చీరల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై దౌర్జన్యం చేసి విలువైన మగ్గాలు, మిషనరీలు, పట్టుచీరలు దౌర్జన్యంగా తీసుకెళ్లి నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు యశోద వేడుకున్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2017లో రాజేశ్వరావుకు సంబంధించిన భూమిలో కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని షెడ్ నిర్మించి అందులో వస్త్రాలు నేసేందుకు 4 మగ్గా లు, మిసనరీలు ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. అయితే భూమి యజమాని ఉన్నఫళంగా ఖాళీ చే యమంటూ తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు.


