చెవిరెడ్డి పేరిట దండాయుధపాణికి అర్చనలు
అనారోగ్యంతో ఎయిమ్స్‌కు చేరిన చెవిరెడ్డి
ఆయన ఆరోగ్యం కుదుట పడాలని నేతల పూజలు
దండాయుధపాణికి నేతి దీపాల సమర్పణ
తిరుపతి రూరల్: ‘‘మద్యం అక్రమ కేసులో అరెస్టయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 140 రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆయన అనారోగ్యంతో విజయవాడలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుసుకున్న చెవిరెడ్డి అనుచరులు ఆరోగ్య ప్రదాత అయిన దండాయుధ పాణికి మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేశారు. చెవిరెడ్డి పేరిట అర్చన చేయించి, కార్తీక పౌర్ణమి కావడంతో నేతి దీపాలు వెలిగించి చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్రల నుంచి కాపాడాలని వేడుకున్నారు.’’ తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని పద్మగిరి కొండపై ఉన్న బాలజ్ఞాన దండాయుధపాణి ఆలయంలో చెవిరెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని, త్వరగా బెయిల్‌పై బయటకు రావాలని ప్రార్థిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు ఏదో ఒకరకమైన సాయం అందించే చెవిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని, రాజకీయ కక్షలో భాగంగా ఆయనను జైలు పాలు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వమే నడిపిన మద్యం పాలసీలో తప్పు జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవాలే కానీ అప్పటి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టడం చూస్తేనే ఆ కేసు ఒక తప్పుడు కేసుగా అందరికీ అర్థమవుతోందన్నారు. చెవిరెడ్డిని ఇంకెంత కాలం జైలులో బంధిస్తారో కూటమి పెద్దలు చెప్పాలని, ఏ తప్పు చేయని కేసులో ఇంతలా శిక్ష విధించడం దుర్మార్గమన్నారు. చంద్రగిరిలో వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేంత వరకు చెవిరెడ్డి కుటుంబం వెన్నంటి నడుస్తామని స్పష్టం చేశారు. చివరగా ఆలయం వద్ద చెవిరెడ్డి ఆరోగ్యం కుదుటపడేంత వరకు స్వామి వారికి ప్రతి రోజు ఉదయం చెవిరెడ్డి పేరిట అర్చన జరిపించేలా ఆయన గోత్ర నామాలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నడవలూరు పంచాయతీ పార్టీ అధ్యక్షులు గంగరామిరెడ్డి, సర్పంచ్ గణపతిరెడ్డి, సి.రామాపురం సర్పంచ్ పవన్‌కుమార్ రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ముండ్లపూడి సర్పంచ్ సూరి, చంద్రగిరి నియోజక వర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు బోడిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్సీపురం మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు యశ్వంత్‌రెడ్డి, తిరుపతి రూరల్ మండల నేతలు సుబ్రమణ్యంరెడ్డి, శుభ పద్మనాభరెడ్డి, హేమంత్‌కుమార్‌రెడ్డి, ముచ్చేలి కిరణ్‌కుమార్‌రెడ్డి, తులసీరామిరెడ్డి పాల్గొన్నారు.


