మూడున్నర టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని చిన్నపాలేడు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం పట్టుకున్న రేషన్ బియ్యాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలోని చిన్నపాలేడు వద్ద శ్రీకాళహస్తికి చెందిన సాయి, రాజా, ఒక మినీట్రక్కులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. దీంతో శ్రీకాళహస్తి–సూళ్లూరుపేట మార్గంలతోని చిన్నపాలేడు వద్ద ఉండగా శ్రీకాళహస్తి నుంచి సూళ్లూరుపేటకు ఒక మినీ ట్రక్కు వెళుతుండగా ఆపి తనిఖీ చేశామన్నారు. అందులో మూడున్నర టన్నుల రేషన్ బియ్యం ఉండగా గుర్తించి వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపా రు. డ్రైవర్లు సాయి, రాజాలపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించామన్నారు. కేసు దర్యాప్తు చేసి మిగిలిన వారిని పట్టుకుంటామని తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని తెలిపా రు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ఐ సుధీర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుళ్లు బాలగురవయ్య, కానిస్టేబుళ్లు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
నారాయణవనం: తరలించడానికి సిద్ధంగా ఉంచిన 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ రవీంద్ర తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం ముందస్తు సమాచారంతో రెవెన్యూ సిబ్బంది, స్థానికులతో కలిసి కీళగరం బీసీ కాలనీలో నివాసమున్న రవి ఇంటిని సోదా చేశారు. తరలించడానికి సిద్ధంగా ఉంచిన రూ.31 వేల విలువైన 7 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీళగరం వీఆర్వో ఫిర్యాదు మేరకు రవిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రవీంద్ర తెలిపారు.


