ఆ అధ్యాపకుని తక్షణం తొలగించాలి
తిరుపతి సిటీ: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ర్యాగింగ్‌ను ప్రోత్సహించి, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వర్సిటీలోని అన్నమయ్య భవన్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ వర్సిటీల కన్వీనర్ అశోక్ అధ్యక్షతన మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్ చేయడం, అలాగే ర్యాగింగ్‌ను ప్రోత్సహించిన ప్రొఫెసర్ నుంచి హెడ్‌షిప్‌ను తొలగించడం, విచారణ కమిటీ నియమించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే విచారణ కమిటీ నివేదిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, తరగతి గదుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులను ‘కాంప్రమైజ్ అవ్వండి’ లేదా ఇక్కడ టీసీ తీసుకోవాలంటే రూ.2 లక్షలు కట్టాలని, వేరే చోట చదివే అవకాశం లేకుండా చేస్తామని బెదిరించినట్లు విద్యార్థినులు తెలపడంతో రౌండ్ టేబుల్‌లో ఉన్న విద్యార్థి నాయకులు నేరుగా సైనన్స్ కళాశాల ప్రిన్సిపల్ చాంబర్‌కు వెళ్లగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోగా, వెస్ట్ సీఐ మురళీమోహన్ జోక్యం చేసుకుని విద్యార్థులను శాంతింప చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎస్వీయూ కార్యదర్శి వినోద్, ఎన్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జన్నే మల్లికార్జున, పీడీఎస్‌ఓ జిల్లా కార్యదర్శి ఆశ, జీఎన్‌ఎస్ ఫౌండర్ శివశంకర్ నాయక్, నెల్సా జాతీయ అధ్యక్షుడు సుందరరాజు, జేబీఎస్‌ఎఫ్ రాయలసీమ కన్వీనర్ భార్గవ్ సాయి, శివ బాలాజీ, కుమార్, జెన్ కిరణ్ దేవేంద్ర పాల్గొన్నారు.


