ప్రైవేటు ఫీజులుం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఫీజులుం

Nov 3 2025 6:18 AM | Updated on Nov 3 2025 6:18 AM

ప్రైవ

ప్రైవేటు ఫీజులుం

ఫీజు చెల్లించు..లేదంటే బయటకెళ్లు కూటమి ప్రభుత్వం ఆర్భాటానికే ఆర్టీఈ ప్రవేశాలు చిత్తూరు, తిరుపతి జిల్లాలో 3,978 సీట్లు కేటాయింపు విద్యాహక్కు చట్టానికి ప్రైవేట్‌ యాజమాన్యం తూట్లు ఉచితమైనా ఫీజులు చెల్లించాలని ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల నిర్వాహకుల బెదిరింపులు మేం ఎవ్వరి మాట వినమంటున్న యాజమాన్యాలు వైఎస్సార్‌సీపీ పాలనలో పక్కాగా ఆర్టీఈ అమలు కూటమి పాలనలో పర్యవేక్షణ పట్టని విద్యాధికారులు

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టం అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. రెండు జిల్లాల్లో కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు విద్యాహక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారు. ఈ చట్టం కింద ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల్లో 3978 సీట్లను కేటాయించి ఉచిత ప్రవేశాలు కల్పించారు. ఈ విధానంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎటువంటి ఫీజులు పాఠశాలకు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ విధానంలో ప్రవేశాలు పొందినా ఫీజులు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఫీజలు చెల్లించని విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా మండు టెండలో నిలబెట్టి తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇక్కడ మేం చెప్పిందే వేదం..అంటూ చట్టం గిట్టం జాన్తానై అంటున్న ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల తీరుపై ప్రత్యేక కథనం.

చిత్తూరు జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో ఉండే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో అరవింద్‌ అనే విద్యార్థి 2025–26 విద్యాసంవత్సరానికి ఒకటవ తరగతిలో ఆర్‌టీఈ విధానంలో అడ్మిషన్‌ పొందాడు. ఆ విద్యార్థి అడ్మిషన్‌ పొందుతున్నట్లు విద్యాశాఖ అధికారులు కేటాయింపు పత్రం సైతం ఇచ్చారు. అయితే ఆ పాఠశాల నిర్వాహకులు నిత్యం ఆ విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పలుసార్లు ఇంటికి పంపించిన ఘటనలు సైతం ఉన్నాయి.

తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ఆర్‌టీఈ విధానంలో 15 మంది విద్యార్థులను కేటాయించారు. ఆ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం నుంచి ఫీజుల పేరుతో ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అయితే నిబంధనలను అతి క్రమించి ఆ పాఠశాల యాజమాన్యం పరీక్షలు నిర్వహించినప్పుడల్లా ఆ విద్యార్థులను ఫీజు చెల్లించలేదని తరగతి బయట నిలబెడుతున్నారు. ఈ విషయంపై ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఫీజు చెల్లించాలని ఇబ్బందులు పెడుతునే ఉన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆర్‌టీఈ చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకు ఉచితంగా విద్యనభ్యసించే వెసులుబాటు ఉంటుంది. అయితే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్తవంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్‌ ఫండ్‌, స్పెషల్‌ ఫీజు, ఐఐటీ, నీట్‌ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యాశాఖ అధికారులకు ఉన్నా ఆ అధికారాన్ని కాగితంపై పెట్టకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.

ఒకరిపై మరొకరు ఫిర్యాదులు

ఆర్‌టీఈ అడ్మిషన్లను పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఒకరిపై మరొకరు వేసుకుంటున్నారు. విద్యాశాఖ, జిల్లా సమగ్రశిక్ష శాఖలు తమకు సంబంధం లేదంటూ ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్నారు. నిత్యం వందల మంది తల్లిదండ్రులు ఫీజుల విషయం పై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన ఉండటం లేదు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని విద్యార్థులు ఆర్‌టీఈ అడ్మిషన్‌లు పొందినప్పటికీ నష్టపోతున్నారు. పకడ్బందీగా పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులే తమకేం సంబంధం లేదన్నట్లు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు కొమ్ము కాస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.

చులకన భావం.. వెనుక బెంచీలో కూర్చోపెట్టి..

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆర్టీఈ అడ్మిషన్లు పొందిన విద్యార్థుల పట్ల పలు యాజమాన్యాలు చిన్నచూపు చూస్తున్నాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వల్ల ఎలాంటి ఫీజులు రావనే ఉద్దేశంతో కొన్ని యాజమాన్యాలు చిన్నచూపు చూస్తూ ఆ విద్యార్థులను వెనుకబెంచీలలో కూర్చొబెట్టడం చేస్తున్నారు. మరికొన్ని బడుల్లో తల్లిదండ్రుల నుంచి అడ్డగోలుగా ఫీజులు దోచేస్తున్నారు. విద్యార్థుల పట్ల తారతమ్యాలు సృష్టించి చులకన భావంతో చూడటంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తిరుపతి జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలల సమాచారం

వైఎస్సార్‌సీపీ పాలనలో ఆర్‌టీఈ అడ్మిషన్‌లను పకడ్బందీగా అమలు చేశారు. ప్రస్తుత కూటమి సర్కారు ఆర్‌టీఈ ప్రవేశాలు పొందిన విద్యార్థుల పట్ల ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదేళ్ల పాటు పకడ్బందీగా ఆర్టీఈ అడ్మిషన్లను అమలు చేసి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించేవారు. గతంలో ఎన్నడూ అమలు కాని విద్యాహక్కు చట్టాన్ని వైఎస్సార్‌సీపీ పాలనలోనే అమలు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగారుస్తోంది.

ఫీజుల పేరుతో ముప్పుతిప్పలు

ఆర్‌టీఈ అడ్మిషన్ల విషయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలు మేం ఎవ్వరి మాట వినేది లేదన్నట్లు గా వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని.. సుప్రీం కోర్టు నిర్దేశాలను పలు ప్రైవేటు/కార్పొరేటు పాఠశాలలు లెక్కచేయడం లేదు. విద్యార్థులను, తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెట్టి ఫీజుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. చట్టాన్ని కొన్ని పాఠశాలలు అమలు చేయకపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల నుంచి ఏదో ఒక రూపేణా ఫీజులు లాగేస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు.

ప్రైవేటు ఫీజులుం1
1/1

ప్రైవేటు ఫీజులుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement