వెటర్నరీలో వసూల్ రాజాలు!
చంద్రగిరి : ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో వసూల్ రాజాలు రెచ్చిపోతున్నారు. కూటమి నేతల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా వీసీ, రిజిస్ట్రార్ పేషీలోని కొంత మంది అధికారుల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
నేతల లాబీయింగ్
వెటర్నరీ యూనివర్సిటీలో ఇటీవల ప్రభుత్వం శాశ్వత రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన జీఓపై స్థానిక రాజకీయ నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించినట్లు సమాచారం. వెటర్నరీ వైద్యుల ఉద్యోగాలతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులపై కన్నేసినట్లు తెలుస్తోంది. తమ అనుచరులైన సుమారు 12 మందికి ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వర్సిటీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వారి అనుచరులను సైతం పరిగణలోకి తీసుకోవాలని వీసీపై ఒత్తిడి ప్రారంభమైనట్లుగా సమాచారం. నాన్ టీచింగ్ ఉద్యోగులుగా తమ వారికి కొలువులు ఇవ్వాలని తిరుపతికి చెందిన కేబినేట్ హోదా కలిగిన వ్యక్తి, స్థానిక కూటమి నేత హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న మరో నేత.. గత ఎన్నికల సమయంలో యువగళంలో ప్రధాన భూమిక పోషించిన సుమారు 15 మంది తన అనుచరులకు ఉద్యోగవకాశాలు కల్పించాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం.
కోర్టును ఆశ్రయించనున్న అర్హులు
వర్సిటీలో శాశ్వత ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ నియామకాలపై గన్నవరం, ప్రొద్దుటూరు, గరివిడి ప్రాంతాలకు చెందిన వెటర్నరీ కళాశాలల తాత్కాలిక ఉద్యోగులు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే న్యాయవాదులతో చర్చలు జరిపుతున్నట్లు సమాచారం. దీంతో శాశ్వత నియామకాలపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నియాకమాలపై కూటమి నేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేదుకు పావులు కదుపుతున్నారు. కూటమి నేతల ఒత్తిడికి వర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరి జాబితాను పరిగణనలోకి తీసుకుంటే ఎవరి పోస్టుకు ముప్పు వస్తుందో అని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
ఔట్ సోర్సింగ్ సిబ్బందే లక్ష్యం
వర్సిటీలోని సుమారు 70 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆశచూపి కొందరు అధికారులు నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. వారిని టైమ్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ దందాకు తెర తీశారు. అందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా తయారు చేసి వారిని టైంస్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆధారంలో ఒక్కో చిరు ఉద్యోగి నుంచి రూ.20 నుంచి రూ.30వేల వరకు అక్రమంగా గుంజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


