ప్రైవేటీకరణ.. ప్రజాద్రోహం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నత ఆశయంలో నెలకొల్పిన మెడికల్ కాలేజీలను కూటమి సర్కారు కుట్రపూరితంగా ప్రైవేటీకరణకు పాల్పడుతోందని, ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని పార్టీ ఎస్సీ నేతలు మండిపడ్డారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్పీ సెల్ అధ్యక్షుడు తలారి రాజేంద్ర నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు నేతలు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం జిల్లాల వారీగా వైద్య విద్యతో పాటు నాణ్యమైన చికిత్సలందించేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగనన్న స్థాపించినట్లు వెల్లడించారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే దుస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు భారీగా పెరుగుతాయని, ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దూరమవడంతో ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణిస్తుందని వివరించారు. రూ.లక్ష కోట్లు విలువచేసే ప్రజల ఆస్తుల ప్రైవేటు పరమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి సహకరించే దుర్మార్గ పాలన రాష్ట్రంలో సాగుతోందని మండిపడ్డారు. ప్రజల నిధులతో నిర్మించిన సంస్థలను ప్రైవేట్‌కు అప్పగించడమంటే, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహచించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ఎస్సీసెల్ పూతలపట్టు ఇన్‌చార్జి రామచంద్ర, శ్రీకాళహస్తి ఇన్‌చార్జి కృష్ణయ్య, కార్పొరేటర్ ఆంజనేయులు, నేతలు అజయ్‌కుమార్, మురళీ, చింత రాజేంద్ర, నల్లని బాబు, కల్లూరి చెంగయ్య, మంశీ, మిథున్, నారాయణ రాజ్, చిన్న, తేజస్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
