రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే టికెట్ బుకింగ్‌లో సంబంధిత శాఖ పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన మార్పులు ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దింది. అలాగే ముందస్తు రిజర్వేషన్ గడువు విషయంలోనూ కీలక మార్పులు చేసింది. రైలు ప్రయాణ సమయంలో లోయర్ బెర్తులు కేటాయించాలని సీనియర్ సిటిజన్లు, మహిళలు కోరుతున్నారు. అలాగే ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో అప్పర్, మిడిల్ బెర్తుల కావాలని పలువురు అడుగుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను రైల్వేశాఖ మెరుగుపరచింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వనుంది. అయితే ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది. బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోయినా, తర్వాత రైలులో సీటు ఖాళీగా ఉంటే టీసీ వారికి దిగువ బెర్తును కేటాయించవచ్చు.
వినూత్నంగా నూతన ఆప్షన్
లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి అనే ఆప్షన్ ఎంచుకుంటే రైలులో లోయర్ బెర్తులు అందుబాటులో ఉంటేనే టిక్కెట్లు బుక్ అవుతాయి. లేకుంటే బుకింగ్ ప్రాసెస్ అవ్వదు. లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే వారికి వినూత్నమైన ఈ కొత్త ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలాగే రైలు ప్రయాణికులు నిద్రించే, కూర్చునే సమయాలకు సంబంధించి స్పష్టమైన నియమాలను తీసుకువచ్చింది. నిద్ర సమయాలను ఇప్పుడు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించింది. ఈ సమయంలో ప్రయాణీకులు తమకు కేటాయించిన బెర్తులపై విశ్రాంతి తీసుకోవచ్చు. పగటిపూట అసౌకర్యాన్ని నివారించడానికి అందరు ప్రయాణీకులు తమ సీట్లపై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆర్‌ఏసీ టిక్కెట్లు కలిగిన వారికి..
పగటిపూట, సైడ్ లోయర్ బెర్తు ప్రయాణికులు, సైడ్ అప్పర్ బెర్తు బుక్ చేసుకున్న ప్రయాణికులు పంచుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం లోయర్ బెర్తున్న ప్రయాణీకుడు మాత్రమే కూర్చొనే అవకాశం ఉంటుంది.
రిజర్వేషన్ గడువు తగ్గింపు
ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వేశాఖ తగ్గించింది. గతంలో రైల్వే టిక్కెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ కాల వ్యవధిని కేవలం 60 రోజులకు తగ్గించారు. ఈ నిర్ణయం టికెట్టు రద్దు సమస్యలను తగ్గించడంతో పాటు బుకింగ్ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరిస్తుందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు.


