ఆలయాల్లో దుర్ఘటనలకు కూటమి ప్రభుత్వమే కారణం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఏడాదిన్నరగా రాష్ట్రంలోని పలు హిందూ ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలకు కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధూసూదనరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన తిరుపతి ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు ఫలితంగా సామాన్య పౌరులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్ల జారీ తొక్కిసలాటలో ఆరుగురు, నాడు సింహాచలం అప్పన్న ఆలయ ఉత్సవాల తొక్కిసలాటలో ఎనిమిది మంది, ఏకాదశి సందర్భంగా నిన్న శ్రీకాకుళంలోని బుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మందితో కలుపుకుంటే మొత్తం 24 మంది భక్తులు ప్రాణాలను కోల్పోయారన్నారు. దీనిని పరిశీలిస్తే ఆలయాల పర్వదినాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఆయా ప్రాంతాల అధికార యంత్రాంగం నిర్లక్ష్యధోరణికి నిదర్శమని పేర్కొన్నారు. అయితే దుర్ఘటనలకు సంబంధించి రాష్ట్ర హోమ్, దేవాదాయశాఖ మంత్రులు ఇచ్చిన వివరణ హాస్యాస్పందంగా ఉందన్నారు. అపారమైన భక్తితో ఆలయాలకు వచ్చిన భక్తుల భద్రత గురించి తేలికగా మాట్లాడడం హిందువుల మనోభావాలను కించపరచడమే అన్నారు. భద్రత కల్పించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
పింఛన్ల పంపిణీలో జిల్లా ఫస్ట్
తిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్లు తొలి రోజు పంపిణీలో రాష్ట్రంలో తిరుపతి జిల్లా 95.59 మందికి పంపిణీ చేసి, ప్రథమస్థానంలో నిలిచింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేపట్టిన పంపిణీలో 2,62,556 పింఛన్లకు మొదటి రోజు 2,50,974 మందికి అందజేశారు. జిల్లాలోని దొరవారి సత్రం మండలంలో 97.06 శాతం, కేవీబీపురం మండలంలో 96.94 శాతం, పుత్తూరులో 96.49 శాతం, శ్రీకాళహస్తి రూరల్‌లో 96.25 శాతం, తిరుపతి అర్బన్‌లో 96.11 శాతం, శ్రీకాళహస్తి అర్బన్‌లో 96.05 శాతం మందికి పంపిణీ చేసి ఈ మండలాలు ముందు వరుసలో నిలిశాయి. దీంతో జిల్లా కలెక్టర్ డీఆర్‌డీఏ పీడీ శోభనబాబుతోపాటు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులను అభినందించారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేయనున్నారు.


