● వర్సిటీలో 14వరకు డేస్కాలర్స్‌కు స్పాట్ అడ్మిషన్లు ● ఈ ఏడాది వర్సిటీలో ఐకేఎస్ నూతన కోర్సు ప్రారంభం ● మీడియాతో వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ, ఉత్కల పీఠం సంయుక్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ప్రస్థానత్రయంలో భాషోత్సవం పేరుతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో ఎన్‌ఈపీ–2020 విధానాన్ని అమలు చేస్తూ పలు నూతన కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. డిగ్రీ ఆనర్స్‌తో పాటు రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యూజీ, పీజీ కోర్సుల్లో పదుల సంఖ్యలో మిగిలి ఉన్న సీట్లకు ఈ నెల 14 వరకు డేస్కాలర్స్‌కు స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి యూజీ, పీజీలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకేఎస్) కోర్సును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వర్సిటీలో నిర్మించిన శ్రీ స్వామినారాయణ సంప్రదాయ అక్షర పురుషోత్తమ మందిరాన్ని ఆదివారం ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. జాతీయ సదస్సుకు వీసీలు, ఒడిశా గవర్నర్, ఉత్తరాఖండ్ సీఎం హాజరవుతారని చెప్పారు. అలాగే స్వామినారాయణ సంప్రదాయ సంస్థలతో విశ్వవిద్యాలయం పరస్పర అవగాహనా ఒప్పందం చేసుకుని అమెరికా, ఇగ్లండ్, అబుదబి, నేపాల్లో ఉన్నటువంటి సంస్థలతో కలిసి విశేష పరిశోధనలు జరపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటనారాయణ, ఉత్కల పీఠం డైరెక్టర్ జ్ఞానరంజన్‌పండా, పీఆర్‌ఓ ప్రొఫెసర్ రమేష్ బాబు, ఏపీఆర్‌ఓ డాక్టర్ కనపాల కుమార్ పాల్గొన్నారు.