
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
వెంకటగిరి రూరల్: పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన వెంకటగిరి పట్టణంలోని అమ్మవారిపేటలో శనివారం జరిగింది. వెంకటగిరి ఎగువ అరవపాళేనికి చెందిన అరవ మధు, మోహనమ్మ దంపతుల కుమారుడు అచ్చుత్‌హేమంత్(14) పట్టణంలోని రాణిపేట సమీపంలో ఉన్న జెడ్పీ హైస్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధి తోటి విద్యార్థులు సుమారు 8 మందితో కలిసి, మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి ఎదురుగా ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులో ఈత కొడుతుండగా అచ్చుత హేమంత్ మునిగిపోతుండడంతో గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న జాలరి ఆ విద్యార్థిని కాపాడి మందలించి పంపివేశారు. అయినప్పటికీ విద్యార్థులు మళ్లీ చెరువులో మునిగే ప్రయత్నం చేయగా అచ్చుత హేమంత్ గల్లంతయ్యాడు. భయబ్రాంతులకు గురైన తోటి విద్యార్థులు పాఠశాలకు చేరుకోని ఈతకు వెళ్లిన విషయం ఉపాధ్యాయులకు తెలిపారు. హెచ్‌ఎం ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించి, చెరువువద్ద గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల హెచ్‌ఎం, విద్యార్థి తల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా అచ్చుతహేమంత్ మృతదేహం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి