
నిర్వహణ రెండుసార్లు
వేదిక.. కార్యక్రమం ఒకటే..
● అటు ఎమ్మెల్యే, ఇటు ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్‌తో అన్నదాత సుఖీభవ ● సత్యవేడులో సర్వత్రా చర్చనీయాంశం ● తారస్థాయికి చేరుతున్న పచ్చనేతల మధ్య విభేదాలు
వరదయ్యపాళెం: నియోజకవర్గ కేంద్రమైన సత్యవేడులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఒకే కార్యక్రమాన్ని ఒకే వేదికపై వేర్వేరుగా రెండుసార్లు నిర్వహించడం ఏమిటని సత్యవేడులో స్థానికులు చర్చించుకున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సత్యవేడులోని బేరిశెట్టి కల్యాణ మండపంలో వ్యవసాయశాఖ అధికారులతో కలసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించి, మెగా చెక్కును రైతులకు అందజేశారు. అదే కార్యక్రమాన్ని మధ్యాహ్నం పైన మరోమారు బేరిశెట్టి కల్యాణ మండపంలోనే నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్‌గా నియమితులైన శంకర్ రెడ్డి సమక్షంలో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఏడు మండలాల పార్టీ శ్రేణులతో కలసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ హాజరయ్యారు. అలాగే వ్యవసాయశాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఎలా హాజరవుతారని అక్కడ స్థానిక ప్రజలు ప్రశ్నించడంతో పాటు చర్చించుకున్నారు.
సత్యవేడు టీడీపీలో
తారస్థాయికి చేరుతున్న విభేధాలు
ఇటీవల సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్‌గా తిరుపతికి చెందిన వ్యాపారవేత్త శంకర్‌రెడ్డి నియామకంతో సత్యవేడు టీడీపీలో సమస్యలు సమసిపోతాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. అందుకు నిదర్శనమే సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ అధికారిక కార్యక్రమాన్ని రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించడం. అంతేకాక ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలోని పలుచోట్ల పాత్రికేయ సమావేశాలు నిర్వహించి మరీ శంకర్‌రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలికి ధీటుగానే ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ శంకర్ రెడ్డి సైతం ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే హాజరవుతున్న కార్యక్రమాలకు టీడీపీ శ్రేణులు హాజరు కాకుండా ఇప్పటికే శంకర్ రెడ్డి కట్టడి చేశారు. ఏడు మండలాల్లో సైతం ఎమ్మెల్యే ఎక్కడ హాజరైనా గతంలో ఆయన వెంట నడిచిన వారు సైతం నేడు హాజరు కాకుండా ముఖం చాటేస్తున్నారు. అంతేకాకుండా అధికారులను సైతం తమ వెంట నడిచేలా, తమ కనుసన్నల్లో పనిచేసేలా ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. దీంతో రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా దారి తీస్తాయో వేచి చూడాలి మరి.

నిర్వహణ రెండుసార్లు