
ఘనంగా ఎంబీయూ స్నాతకోత్సవం
● ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
చంద్రగిరి: మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)లో శనివారం రెండో స్నాతకోత్స వం, 14వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంబీయూ చాన్సలర్ డాక్టర్ మంచు మోహన్‌బాబు అధ్యక్షతన ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, విశ్వహిందీ పరిషత్ అధ్యక్షు డు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. ముఖ్యఅతిథి ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నాకు గర్వ కారణంగా ఉందన్నారు. చాన్సలర్ మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రఫుల్ పటేల్‌తో 1995లో మొదలైన పరిచయం బలమైన స్నేహంగా మారిందని తెలిపా రు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు, లోక్‌మత్ పత్రిక అధ్యక్షుడు విజయ్ జవహర్ దార్దా విద్యావేత్తగా, నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా చేసిన సేవలను గుర్తుచేశారు. ఎంబీయూ ద్వారా 866 మంది విద్యార్థులు, శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 1,698 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందుకున్నారు.
డ్రమ్స్ శివమణి, విజయ్ జవహర్ దార్దాకు గౌరవ డాక్టరేట్లు
ప్రముఖ సంగీత విద్వాంసుడు, డ్రమ్స్ శివమణితో పాటు మహారాష్ట్రకు చెందిన లోక్‌మత్ పత్రిక అధినేత విజయ్ జవహర్ దార్దాకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ఈ సంవత్సరం దేశంలోనే ప్రముఖ వ్యక్తులకు డాక్టరేట్ ఇచ్చామని, ఇది ఇలాగే కొనసాగుతుందని అని ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. అనంతరం విశ్వహిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, వైస్ చాన్సలర్ నాగరాజ్ రామారావు, రిజిస్ట్రార్ సారథి, డీఎఫ్‌ఏ రవిశేఖర్, సీజీఎస్‌ఓ వికాస్ సింగ్, డీన్లు, ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు పాల్గొన్నారు.