
బళ్లారి రాఘవాచారి సేవలు అభినందనీయం
తిరుపతి అర్బన్: రంగస్థలం నాటకాలకు బళ్లా రి రాఘవాచారి అందించిన సేవలు అభినందనీయమని డీఆర్వో నరసింహులు కొనియాడారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం బళ్లారి రాఘవాచారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బళ్లారి రాఘవాచారి తెలుగు నాటక రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని చెప్పారు. అలాగే సినిమా రంగంలోనూ తన రచనలతో ప్రసిద్ధి చెందారన్నారు. నాటక రంగంలో ఎన్నో పాత్రల్లో నటించి మంచి పేరును పొందారని గుర్తు చేశారు. రాయలసీమలో జన్మించిన రాఘవాచారి రంగస్థలంలో తన నటనతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు.
ఔషధ మొక్కల పెంపకం అవసరం
తిరుపతి సిటీ: ప్రతి ఒక్కరికీ ఔషధ మొక్కల పెంపకం అవసరమని ఎస్వీయూ వీసీ ఆచార్య అప్పారావు పేర్కొన్నారు. ఎస్వీయూ సెనేట్ హాల్‌లో శనివారం బోటనీ విభాగం, శ్రీ రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఔషధ మొక్కల పెంపకం– సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఆయుర్వేదిక్ ఔషధాలు మన జీవనంలో జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. ప్రాచీన కాలంలో ఉపయోగించిన యునానీ, ఆయుర్వేదిక్, సిద్ధ, తదితర పద్ధతులను అవలంబించాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఆయుర్వేద మందులు వాడుతున్నానని, ఎటువంటి ఇంగ్లిష్ మందులు, అల్లోపతి మందులు వాడడం లేదని, అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ఈ సదస్సులో ఏపీ మెడిసిన్ ప్లాంట్స్ సీఈఓ చంద్రశేఖర్, డాక్టర్ రేణు దీక్షిత్, డాక్టర్ విజయ, డాక్టర్ కామాక్షమ్మ, టి గంగాధరం పాల్గొన్నారు.
గృహహింస కేసుల్లో ప్రభుత్వఅధికారులతోనే కౌన్సెలింగ్
తిరుపతి అర్బన్: గృహహింస చట్టానికి సంబంధించిన కౌన్సెలింగ్ కేసులు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని శనివారం ఓ ప్రకటనలో ఐసీడీఎస్ పీడీ వసంతబాయి వెల్లడించారు. అంతేతప్ప ఎటువంటి ఎన్జీవోస్.నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారు భాగస్వాములు కావడం లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వం ద్వారా నియమించిన వారు మాత్రమే కేసుల విచారణలో ఉంటారన్నారు.
చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగింత
నాయుడుపేటటౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ చోరీ చేయడానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు శనివారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బస్టాండ్ వద్ద ఓ వృద్ధుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను చోరీ చేస్తుండగా అతడు గుర్తించి, కేకలు వేశాడు. దీంతో ప్రయాణికులు చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు. అతని పాటు ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టు కున్న వ్యక్తిని పోలీసుకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.