
ఉద్యాన పంటలకు ప్రాధాన్యం
చంద్రగిరి : రైతు ఉత్పత్తిదారులు(ఎఫ్‌పీఓ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జేసీ శుభం భన్సల్‌తో కలిసి రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్‌ఓపి) అభివృద్ధి కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణలో కమిటీ సమావేశం, అగ్రిస్టాక్ వర్కషాప్‌ను మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పిఓ) సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎఫ్‌పీఓ సభ్యుల కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి వారి అభివృద్ధికి కావాల్సిన సహకారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా డ్రోన్లను అధిక శాతం వినియోగించుకోవాలన్నారు. ఆయిల్ ఫాం, ఆక్వా రంగంలో ఇటీవల మంచి రాబడులు వస్తున్నాయని, ఆక్వా రంగం వైపు రైతులు దృష్టి సారించాలన్నారు.
అగ్రిస్టాక్, ఏఐపై వర్కషాప్..!
అగ్రిస్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులకు కలెక్టర్ వర్క్‌షాప్ నిర్వహించారు. అగ్రిస్టాక్ అనేది రైతు రిజిస్ట్రీ, జియో–రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్, క్రాప్ ఫోన్ రిజిస్ట్రీతో సహా ముఖ్యమైన వ్యవసాయ డేటా సెట్లను ఏకీకృతం చేసే సమాఖ్య అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి రవి కుమార్, ఎల్‌డీఎంలు రవి కుమార్, సునీల్, నాబార్డ్ డీడీఎం సతీష్ కుమార్, జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జగదీశ్, రీజనల్ మేనేజర్ భాస్కరయ్య, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏఓలు పాల్గొన్నారు.