
అన్నదాత సుఖీభవ జాబితా ప్రదర్శించాలి
చంద్రగిరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్నదాత బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి అన్నదాత సుఖీభవ, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం చేపట్టడం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ కింద 1,54,807 మంది రైతులు అర్హత కలిగి ఉండగా, అందులో ఇప్పటి వరకు 1,50,161 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయడం జరిగిందని, 3,114 మంది ఈకేవైసీ రిజెక్ట్ అయిందన్నారు. 1,532 మంది ఈకేవైసీ పెండింగ్ ఉందని, ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.20,000 నగదును 3 విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుందని, మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2,000 చొప్పున ఆగస్టు 2న విడుదల చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించాలన్నారు.