
సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై ఉద్యమం
● నేడు కలెక్టర్‌కు సమస్యలపై వినతిపత్రం
తిరుపతి అర్బన్ : సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి మొదలెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ ఎస్‌వీ యూనివర్సిటీ అధ్యక్షుడు మన్నం ప్రేమ్‌కుమార్ స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. నాలుగో రోజు వైఎస్సార్ విద్యార్థి సంఘం నేతలు గురువారం తిరుపతిలోని ఎస్సీ, బీసీకి చెందిన పలు హాస్టల్స్‌ను పరిశీలించారు. అక్కడి సమస్యల గురించి స్వయంగా పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని పేర్కొన్నారు. పరిశీలనలో గుర్తించిన సమస్యలను శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం ద్వారా అందజేస్తామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ముని, రాజా, మహేష్, హేమంత్, మధు, జగదీష్, తదితరులు పాల్గొనడం జరిగింది.