
ఒక రైలు.. రెండు టికెట్లు
● తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో జర్నీ ఇక్కట్లు ● గుంతకల్లుకు వెళ్లేటప్పుడు కడపలో ప్యాసింజర్ టికెట్ కొనాలి ● ప్రయాణికులకు తప్పని తిప్పలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: రైలు ఒక్కటే.. కానీ అందులో ప్రయాణించాలంటే మాత్రం రెండు టికెట్లు కొనాలంట.. ఇదీ తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేయాలంటే నిబంధన. విశాఖ–తిరుపతి–కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నెల రోజుల కిందట గుంతకల్లు జంక్షన్ వరకు పొడిగించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పొడిగింపు ప్రక్రియ విధానంలో రైల్వే అధికారులు మార్పులు చేశారు. ఇదేమిటంటే కడప నుంచి గుంతకల్లు వరకు ప్రత్యేక ప్యాసింజర్ రైలుగా మార్చారు. ప్రయాణ టికెట్ విషయంలో మాత్రం గజిబిజి విధానాన్ని అమలు చేశారు. కడప–గుంతకల్లు మధ్య మాత్రం ప్యాసింజర్ (జనరల్) టికెట్ తీసుకోవాలి. అయితే గుంతకల్లు వైపు నుంచి తిరుపతికి రావాలంటే కడపలో దిగి, అక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ టికెట్ కొనాలని నిబంధన పెట్టారు. కాకపోతే కడపలో ట్రైన్ అరగంట ఆగుతుంది.
చాలామందికి విషయమే తెలియదు..
జనరల్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులు గుంతకల్లు–కడప మధ్య జనరల్ బోగీలతో పాటు స్లీపర్‌లో సైతం ప్రయాణించడానికి మాత్రం వెసులుబాటు కల్పించారు. ఈ రైలు గుంతకల్లు నుంచి తిరుపతికి కడప మీదుగా వెళ్తుందనే విషయం చాలావరకు ప్రయాణికులకు తెలియడం లేదు. ఈ విషయం సూచించే విధంగా బోర్డులో మార్పులు, చేర్పులు లేకపోవడంతో తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని కొందరు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టికెట్లను కొనుగోలు చేసే విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారనే హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం రైలును గుంతకల్లు వరకు పొడిగించి పరీక్షిస్తున్నామని, త్వరలో రైలు నేమ్‌బోర్డులో మార్పులు చేస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికులకు తప్పని కష్టాలు..
తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణంలో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గమ్యస్థానం చేరుకోవడానికి ఒకే రైల్లోనే రెండు టికెట్లు కొనాల్సి రావడం సినిమా కష్టాలను తలపిస్తోంది. గతంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ కడప నుంచి తిరుపతి, విశాఖ మీదుగా కొర్బా వెళ్లేది. తిరుపతి నుంచి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం గుంతకల్లు వరకు పొడిగించారు.