
ఈ బదిలీలతో మార్పు అసాధ్యం మేడమ్
● అందరినీ బదిలీ చేస్తేనే ప్రక్షాళన చేసినట్లు అవుతుంది ● పదోన్నతి పొందిన వ్యక్తి..కింద పోస్టులో తిష్ట వేయడం మన కార్పొరేషన్‌లోనే సాధ్యం ● కమిషనర్‌కు ఓ అధికారి బహిరంగ లేఖ
తిరుపతి తుడా: ‘‘తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో ప్రక్షాళన చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు.. నాలుగైదేళ్లుగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఉద్యోగులను మాత్రమే బదిలీ చేశారు..అదే శాఖలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ అధికారిని మాత్రం కదిలించలేకపోయారు.. ఆ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలంటే రెవెన్యూ ఆఫీసర్ నుంచి గుమస్తా వరకు బదిలీ చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యానికి అర్థం ఉంటుంది.. అలాకాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏళ్ల తరబడి తిష్ట వేసిన వ్యక్తిని బదిలీ చేయకుండా కిందిస్థాయిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేసినంత మాత్రాన ఆ శాఖ ప్రక్షాళన జరిగినట్టు కాదన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా’’ అంటూ ఓ అధికారి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్యకు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. అలాగే ఆ లేఖను చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ మంత్రికి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు పంపించారు. ఇంకా ఆ లేఖలో.. ‘కమిషనర్‌గా మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రక్షాళన చేయాలని భావించారు.. మార్పు తీసుకురావాలన్న మీ ఆలోచన మంచిదని అందరూ భావించారు.. ఉద్యోగులు కూడా అందరికీ సమన్యాయం దక్కుతుందని సంతోషపడ్డారు. కానీ ఆ స్థాయిలో ప్రక్షాళన జరగకపోగా 15 ఏళ్లకు పైగా ఒకే పోస్టులో ఉన్న అధికారిని మీరు కదిలించకపోవడం ఉద్యోగులందరి నమ్మకాన్ని దెబ్బతీసింది’ అంటూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు.
మరొకరికి అవకాశం ఇవ్వరా?
సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది చాలామంది ఉద్యోగులు కార్యాలయంలోని అన్ని పోస్టుల్లోనూ పనిచేయాలని భావిస్తున్నారని.. రిటైర్ అయ్యే లోపు రెవెన్యూ ఆఫీసర్‌గా.. మేనేజర్‌గా పని చేయాలనే కోరిక ఉంటుందని లేఖలో వివరించారు. 15 ఏళ్లుగా రెవెన్యూ ఆఫీసర్‌గా ఒకే వ్యక్తి కొనసాగడం వల్ల అనేకమంది ఉద్యోగులు ఆ పోస్టులో పని చేయకుండానే రిటైర్డ్ అయిపోయారన్నారు. అతి తక్కువ కాలంలో మరికొందరు రిటైర్ అయ్యేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్లకు ముఖ్యమైన పోస్టుల్లో పనిచేసే అవకాశాన్ని ఇవ్వండి.. మేనేజర్‌గా పదోన్నతి పొందిన రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవను ఆ పోస్టులోకి పంపించి, మరో సీనియర్ సూపరింటెండెంట్‌కు ఆర్‌ఓగా అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీపై ఉంది మేడమ్ అని కోరారు. ప్రస్తుతం ఈ లేఖ తీవ్ర దుమారం రేగడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.

ఈ బదిలీలతో మార్పు అసాధ్యం మేడమ్