
ఆగని గజరాజుల దాడులు
చంద్రగిరి: పంట పొలాలపై గజరాజుల దాడులు ఆగడం లేదు. 24 గంటలు గడవకముందే మరోసారి పంట పాలాలపై ఏనుగులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రైతుల వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున ఏనుగుల మంద నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాలపై దాడులకు తెగబడ్డాయి. అక్కడ నుంచి రూటు మార్చి శ్రీవారిమెట్టు కాలినడక మార్గం వైపు వెళ్లాయి. దీంతో టీటీడీ విజిలెన్స్, అటవీ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించారు. అయితే అర్ధరాత్రి సమయంలో సుమారు 13 ఏనుగులు నరసింగాపురం ఎస్టీ కాలనీ సమీపంలోని పంట పొలాల్లోకి చొరబడి బీభత్సం సృష్టించాయి. వరి పంటను పూర్తిగా నాశనం చేయడంతో పాటు అరటి చెట్లను ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు ఏనుగులు తిష్ట వేయడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని బాణసంచాలు పేల్చుతూ, డప్పులు వాయిస్తూ అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించారు. అయితే ఏనుగులతో పాటు గున్న ఏనుగులు ఉండడంతో అవి అక్కడ నుంచి కదలకపోవడంతో వారు చేసేదేమీ లేక వెనుదిరిగారు. ఆపై ఉదయం ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు.
నరసింగాపురం ఎస్టీ కాలనీ
సమీపంలోని పంట పొలాలపై దాడి
24 గంటల గడవక ముందే
మరోసారి బీభత్సం
లబోదిబోమంటున్న రైతన్నలు
పంట చేతికొచ్చే సమయంలో ఇలా..
ఆరుగాలం కష్టపడి పండించిన వరి, అరటి పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు వచ్చినట్లు అటవీ అధికారులకు సమాచారం అందిస్తే, సిబ్బంది మాత్రమే వచ్చి.. నామమాత్రంగా బాణసంచా పేల్చారన్నారు. అయితే ఏనుగులు వెనుదిరగకపోవడంతో తామేమీ చేయలేమని వెళ్లిపోయార ని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెలన్నర రోజుల్లో పంట చేతికొస్తుందనుకునే లోపు ఏనుగుల దాడులతో కన్నీళ్లు మిగిలుతున్నాయని వాపోయారు.

ఆగని గజరాజుల దాడులు