
తమ్ముళ్లు..పెద్ద భూమాయగాళ్లు
● కలువాయి మండలంలో 10 ఎకరాల భూకబ్జా ● అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించి మరీ ఆక్రమణ ● భూకబ్జాలతో రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి భూములు కొల్లగొట్టడంలో తెలుగు తమ్ముళ్లు తలమునకలయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 130 ఎకరాల్లో పది ఎకరాలను భూకబ్జా చేయడం బుధవారం వెలుగు చూసింది. ఆ గ్రామ ప్రజలు అందించిన వివరాల మేరకు.. కలువాయి మండలం తెలుగురాయపురంలో 582, 586, 590, 593, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని కాజేందుకు కూటమి నేతలు పలు రకాల కుట్రలు పన్నారు. గత ఏప్రిల్ 25న సాక్షిలో ‘బాబాయ్.. భూచోల్లు’ అనే కథనం కూడా ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేశారు.
హెచ్చరిక బోర్డులను తొలగించి ఆక్రమణ
ఈనేపథ్యంలో మే7న మళ్లీ ఆ భూముల్లో ఉన్న హెచ్చరిక బోర్డులను తొలగించి ఇటాచీ వాహనంతో భూమిని చదును చేసేందుకు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారు. మే 8న తెలుగురాయపురం సర్పంచ్ రమణమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు బి.నారాయణరెడ్డితో పాటు మరో 150 మంది గ్రామస్తులంతా ఐకమత్యంగా కలిసి చదును చేస్తున్న భూముల వద్దకు వెళ్లడంతో అక్కడి నుంచి చిత్తగించారు. తాజాగా తెలుగురాయపురం, తోపుగుంట అగ్రహారానికి చెందిన మరో ఇద్దరు నేతలు కలసి దర్జాగా 10 ఎకరాల భూమిని చదును చేసుకున్న విషయం బుధవారం వెలుగుచూసింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
10 ఎకరాల భూమిని ఆక్రమించి చదును చేసిన టీడీపీ నేతలు