
అక్షరాస్యతే ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ లక్ష్యం
● డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు
తిరుపతి రూరల్ : నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘‘ఉల్లాస్ అక్షరాంధ్ర’’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి అక్షరాంధ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2023లో నిర్వహించిన సర్వే ద్వారా జిల్లాలో గుర్తించిన 88,687 మంది వయోజనులైన నిరక్షరాసులను అక్షరాస్యులుగా చేయడానికి డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మాల ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ మహమ్మద్ ఆజాద్ మాట్లాడుతూ జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌లో 67,170 మందిని డీఆర్‌డీఏకి, 7,280 మందిని డ్వామాకు, 14,237 మందిని మెప్మాకు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. అభ్యసన పూర్తయిన తరువాత అభ్యాసకులందరికీ 2026 మార్చిలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నోడల్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ అక్షరాంధ్ర కార్యక్రమం విజయ వంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఎంపీడీఓ రామచంద్ర, ఏపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు.