
నాణ్యతా ప్రమాణాలను పాటించండి
● ప్రతిసారి జరిమానాలు వేయడం కాదు..లైసెన్స్ రద్దు చేస్తాం ● ఆహార సంబంధిత కేసుల విచారణ సందర్భంగా జేసీ శుభం బన్సల్
తిరుపతి అర్బన్: ఆహార సంబంధిత షాపులు, దుకాణాలు, హోటళ్లు తదితర వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఆహార సంబంధిత పాత కేసులను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఆహార భద్రతాధికారుల ఆధ్వర్యంలో వ్యాపారులను కలెక్టరేట్‌లో సమావేశపరిచారు. ఆ మేరకు జేసీ విచారణ అనంతరం ఆయన ఆహార ప్రమాణాలను పాటించని పలువురు వ్యాపారులకు జరిమానా విధించారు. ప్రధానంగా తిరుపతిలోని ఓ ఐస్‌క్రీమ్ ఏజెన్సీ షాపునకు రూ.50 వేలు, రెస్టారెంట్, డాబాలు, హోటళ్లకు రూ.1.15 లక్షలు, సరైన లేబుల్ వివరాలు లేకుండా వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న ఓ వ్యాపారికి రూ.30 వేలు, ఓ రెసిడెన్షియల్ విద్యాసంస్థకు రూ.30 వేలు, నాణ్యతలేని నెయ్యి విక్రయించిన వ్యాపారికి రూ.15 వేలు, బేకరీ నిర్వాహకుడికి రూ.10వేలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా వివిధ ఆయిల్ స్టాల్స్ ప్యాకెట్లు ముద్రించిన వారికి రూ.2 లక్షలు, ఓ వ్యాపారి కాలపరిమితికి మించిన ఆహార పదార్థాలను దుకాణంలో ఉంచినందుకు రూ.15వేలు జరిమాన విధించారు. మొత్తంగా 20కేసులకు సంబందించి 4,92,000 జరిమాన వేశారు. ఇకపై వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలను పాటించడంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందిన తర్వాతే వ్యాపారం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతిసారి జరిమానాతో సరిపెట్టడం కుదరదని.. మరోసారి ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.