
స్కూళ్ల విలీనం పేరిట భ్రష్టు పట్టించారు
● కేవీబీపురం ఎంఈఓ, సీఆర్పీపై చర్యలు తీసుకోండి ● డీఈవైఓకు పాతపాళెం, ఏపీపురం గ్రామస్తుల ఫిర్యాదు
కేవీబీపురం: ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని ఏపీ పురం(అప్పనిగుంట), పాతపాళెం గ్రామానికి చెందిన సుమారు 60 మంది దళితులు కేవీబీపురం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తమ గ్రామాల్లో నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లను 117 జీఓ విలీనం పేరుతో ఎంఈఓలు భ్రష్టు పట్టించారని ఆరోపించారు. స్కూళ్ల విలీనంలో భాగంగా మ్యాపింగులు చేసే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, గ్రామస్తులకు కనీసం సమాచారం లేకుండా, కమిటీ మెంబర్ల సంతకాలను కూడా ఉపాధ్యాయులు, సీఆర్పీలే ఫోర్జరీ చేసి అడ్డగోలుగా మ్యాపింగులు చేశారని ఆరోపించారు. కమిటీ మెంబర్ల సంతకాల ఫోర్జరీపై తక్షణమే విచారణ జరిపి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీవైఈఓ మహేశ్వరయ్యకు వినతిపత్రం అందించారు. మండలంలోని అనేక గ్రామాల్లో సమస్యలు తలెత్తడానికి కారణమైన ఎంఈఓతో పాటు బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఆర్పీపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా నాయకుడు దాసరి జనార్ధన్ డీవైఈఓకు వినతి పత్రాన్ని అందించారు. సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై డీవైఈఓ మహేశ్వరయ్య స్పందిస్తూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పాతపాళెం గ్రామస్తులు ప్రవీణ్, నాగరాజు, ఏపీ పురం గ్రామస్తులు అక్కులయ్య పాల్గొన్నారు.