
పక్షుల సంరక్షణకు మాస్టర్ ప్లాన్
తిరుపతి అర్బన్: పక్షుల సంరక్షణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా నేలపట్టు పక్షి అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకు సంబంధించి జేసీ శుభం బన్సల్, అటవీ సంరక్షణాధికారి శెల్వం, డీఎఫ్‌ఓ వివేక్‌తో కలసి చర్చించారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం సాధించడానికి అన్ని శాఖల సమన్వయం అత్యంత అవసరమన్నారు. ఈ ప్రక్రియలో ప్రజల జీవనోపాధి, భద్రత, భవిష్యత్ తరాల కోసం ప్రకృతి పరిరక్షణ రెండూ ముఖ్యమైనవిగా వెల్లడించారు. జిల్లాలోని పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి అభయారణ్యం, పరిసర ప్రాంతాల్లో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. ప్రతి శాఖ తమ పాత్రను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ నరసింహులు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ హారిక, డీపీఓ సుశీల దేవి, డీఆర్‌డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా ిపీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ..
తిరుపతి సిటీ: డిగ్రీ నోటిఫికేషన్ ఊసేలేదు కానీ ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఆఫ్‌లైన్‌లో వందలాదిమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. గత వారం ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత రెండు రోజులుగా పద్మావతి డిగ్రీ కళాశాలలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ మాట్లాడుతూ విద్యార్థులు తమకు ప్రవేశాలు దక్కవేమోనని ఇప్పటి నుంచే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం తాము ప్రవేశాలు చేపట్టనున్నామని చెప్పారు.