
హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి
తిరుపతి అర్బన్: జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందించారు. ప్రధానంగా పుత్తూరు బీసీ హాస్టల్ ప్రైవేటు అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని.. అయితే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారన్నారు. అలాగే చంద్రగిరి బీసీ హాస్టల్‌లో అవసరమైన గదులు లేకపోవడంతో ఒక్కో గదిలో 20 నుంచి 25 మంది విద్యార్థులు ఉంటున్నారని చెప్పారు. సత్యవేడులోని ఎస్సీ కళాశాల హాస్టల్ భవనం శిథిలం కావడంతో బీసీ హాస్టల్‌లో విద్యార్థులు తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేటలో విద్యార్థులకు సరైన హాస్టళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తిరుపతిలోని హాస్టళ్లను మెరుగుపరచాల్సి ఉందని తెలియజేశారు. ఆ మేరకు విచారణ చేపట్టి పిల్లలకు న్యాయం చేస్తామని కలెక్టర్ వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, భగత్ రవి, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, జిల్లా నాయకులు శివ తదితరులు ఉన్నారు.