
వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇల్లు కూల్చివేత
● దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన కూటమి నేతలు
చిట్టమూరు: మండలంలోని పెళ్లకూరు అరుంధతీయవాడలో వైఎస్సార్ సీపీ కార్యకర్త ఇంటిని సోమవారం కూటమి నేతల ప్రోద్బలంతో దౌర్జన్యంగా కూల్చివేశారు. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పారిచర్ల రమణయ్య, నాగజ్యోతి దంపతులు 15 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో పూరి గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. గత ఎన్నికల్లో రమణయ్య వైఎస్సార్ సీపీ తరఫున గ్రామంలో పని చేశాడు. దీనిని జీర్ణించుకోలేక గ్రామంలోని కూటమి నేతలు రమణయ్యపై కక్ష గట్టారు. 20 సంవత్సరాల క్రితం గ్రామం నుంచి వెళ్లిన కస్తూరయ్య, ఏడు కొండలు అనే ఇద్దరు గూడూరు మండలం తిప్పగుంటపాళెంలో నివాసం ఉంటున్నారు. గ్రామంలోని కూటమి నేతలు గ్రామం నుంచి వెళ్లిన వారి వద్దకు వెళ్లి పెళ్లకూరులో మీ ఇంటి స్థలం ఉందని, దాన్ని మీకు ఇప్పిస్తామని, వారిని గ్రామానికి తీసుకువచ్చారు. వారం క్రితం కస్తూరయ్య, ఏడుకొండలు వచ్చి ఇది తమ స్థలమని ఖాళీ చేయాలని రమణయ్యను హెచ్చరించి వెళ్లారు. దీంతో రమణయ్య ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి నివేశ స్థలం సర్టిఫికెట్, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్లు తమ పేరుతో ఉన్నాయని, వేరే వారు వచ్చి తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం కస్తూరయ్య, ఏడుకొండలు మరో నలుగురితో కలిసి పెళ్లకూరు గ్రామానికి చేరుకున్నారు. రమణయ్య నివాసం ఉంటున్న పూరింటిని ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న వస్తులను కూడా రోడ్డు పడేశారు. అడ్డుపడిన రమణయ్య భార్య నాగజ్యోతిని కూడా పక్కకు నెట్టేసి ఇంటిని నామరూపాలు లేకుండా చేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో కూలి పనులకు వెళ్లిన బాధితుడు రమణయ్య ఇంటికి చేరుకుని తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే తన దగ్గర ఉన్న ఇంటి స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్లతో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశాడు. అయితే తను కూలి పనులు చేసుకుని దాచుకున్న నగదు, తన భార్య, కుమార్తెకు సంబంధించి బంగారు నగలు కూడా కనిపించడం లేదని పోలీసులకు తెలిపామన్నాడు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. రమణయ్య, భార్య, పిల్లలు ఇంట్లో సామాను రోడ్డుపై పారేయడంతో ఏమి చేయాలో పాలుపోక కుటుంబ సభ్యులు రోడ్డుపైనే బాధ పడుతూ గడుపుతున్నారు.
రమణయ్య ఇంటిని
పీకేస్తున్న దృశ్యం

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇల్లు కూల్చివేత