
విద్యావ్యవస్థ నిర్వీర్యం
చంద్రగిరి: కూటమి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్ రెడ్డి ఆరోపించారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టళ్ల పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో చంద్రగిరిలోని ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేవని, నాణ్యతలేని భోజనం, బోరు నీళ్లను అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో విద్యార్థులు దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
విద్యావ్యవస్థపై దృష్టి సారించాలి
విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొచ్చామని, దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యావ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలని ఓబుల్ రెడ్డి సూచించారు. సీఎం చంద్రబాబు సొంత మండలంలో ప్రభుత్వ హాస్టళ్లు దుస్థితికి చేరుకున్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థులు తాగేందుకు కనీసం మినరల్ వాటర్‌ను సైతం అందించలేదంటే ఈ ప్రభుత్వం విద్యార్థులపై ఎంత శ్రద్ధ వహిస్తోందో ఆర్థం చేసుకోవచ్చన్నారు. హాస్టళ్ల దుస్థితిపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించి, హాస్టళ్ల దుస్థితిపై నివేదిక సిద్ధం చేస్తామన్నారు. ఆపై దుస్థితికి చేరిన హాస్టళ్లలో నాణ్యమైన సౌకర్యాలు అందించాలని ఆగస్టు ఒకటో తేదీన జిల్లా కలెక్టర్‌కు నివేదికతో పాటు అర్జీ సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్‌రెడ్డి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు, హరి, యశ్వంత్ రెడ్డి, రఫి, జిల్లా కార్యదర్శి ప్రదీప్, కార్యవర్గ సభ్యులు పార్థసారథి, శేషారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఓబుల్ రెడ్డి