
అట్టహాసంగా గోదాంకితావధానం
● పృచ్ఛకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అవధాని మేడసాని మోహన్
తిరుపతి రూరల్: పద్మా వతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాలులో సోమవారం గోదాదేవి అవతారోత్సవం సందర్భంగా తెలుగు అధ్యాయన శాఖ, తిరుపతి శ్రీకృష్ణ దేవరాయ సత్సంగ్ సంయుక్తంగా గోదాంకితావధానాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో అవధానిగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కలియుగంలో శ్రీమన్నారాయణుని ప్రాశస్త్యాన్ని, ఔన్నత్యాన్ని భక్త లోకానికి తెలిపేందుకు గోదాదేవి అవతరించిందని తెలిపారు. అనంతరం పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను సమన్వయం చేసుకుంటూ అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వీసీ ఆచార్య ఉమ మాట్లాడుతూ భగవంతుడిని కీర్తిస్తూ గోదాదేవి గానం చేసిన పాశురాలు తిరుప్పావై పాశురాలుగా ప్రసిద్ధి పొందాయని తెలిపారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి ఆలయం ఉందని, ఆమె ధరించిన మాలను శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున మలయప్ప స్వామికి ధరింప చేస్తారని పేర్కొన్నారు. తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ గోదాదేవి భక్తిని కొనియాడుతూ కావ్యంగా మలిచిన శ్రీకృష్ణదేవరాయలు ప్రశంసనీయులన్నారు. ఆచార్య నిర్మలా తమ్మారెడ్డి మాట్లాడుతూ మేడసాని మోహన్‌తో తనకున్న గురు శిష్యుల బంధాన్ని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ అధినేత్రి ఇమ్మని దీపావెంకట్ మాట్లాడుతూ తన తండ్రి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలుగు భాషపై ఎనలేని మక్కువ ఉందన్నారు. పృచ్ఛక వి దుషీమణులుగా నిషిద్ధాక్షరి – ఆచార్య సి.లలితారాణి, న్యస్తాక్షరి – డాక్టర్ యువశ్రీ, దత్తపతి – డాక్టర్ వై సుభాషిణి, సమస్య – డాక్టర్ సి.లత, వర్ణన – డాక్టర్ సి.స్వరాజ్యలక్ష్మి, అప్రస్తుత ప్రసంగం – డాక్టర్ జయమ్మ, పురాణ పఠనం – డాక్టర్ జి సుహాసిని, ఆశువు–డాక్టర్ బి.కృష్ణవేణి వ్యవహరించారు.