
పోలీసు గ్రీవెన్స్‌కు 100 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 100 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
రైల్లో నుంచి పడి వ్యక్తి మృతి
దొరవారిసత్రం : స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే గ్యాంగ్ సిబ్బంది గుర్తించి సూళ్లూరుపేట జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్: ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాష నేర్చుకోవడం కోసం ఆఫ్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే అన్ని కులాలకు చెందిన వారికి అన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, రెండేళ్లుపాటు క్లినికల్ అనుభవం ఉండాలని చెప్పారు. జీఎన్‌ఎం నర్సింగ్ పూర్తి చేసి 3 ఏళ్లు క్లినికల్ అనుభవం ఉండాలని తెలిపారు. 35 ఏళ్లు మించకూడదని స్పష్టం చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జర్మనీభాషపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 8 నుంచి 10 నెలలు శిక్షణ తర్వాత బీ2 స్థాయి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఏపీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని, అంతేకాకుండా ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, నర్సింగ్ డిగ్రీ సర్టిఫికెట్ కాపీ, క్లినికల్ అనుభవం పత్రం ఉండాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. డీఎస్‌సీడబ్ల్యూ ఈఓటీపీటీ జీమెయిల్.కామ్ ద్వారా దరఖాస్తులను పంపాలని చెప్పారు. అదనపు సమాచారం కోసం 916091 2690 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.