
వరలక్ష్మీవ్రతానికి విస్తృత ఏర్పాట్లు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం నిర్వహణ కు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఆయన సోమవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.వెయ్యి చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారని వెల్లడించారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభి షేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాలు
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, తాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
వరలక్ష్మీవ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబు స్వామి, మణికంఠ స్వామి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, అన్నదానం డిప్యూటీ ఈఓ సెల్వం, వీజీవో సురేంద్ర పాల్గొన్నారు.