
తిరుమలలో మాజీ ఉపరాష్ట్రపతి
తిరుమల : భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడుతో కలిసి ఆదివారం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహ భక్తులకు సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు. దీనికి ముందు తిరుమల చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బాలింత మృతి
చిల్లకూరు : మండలంలోని తిమ్మనగారిపాళెంలోని గిరిజన కాలనీకి చెందిన కుడుముల మీనా (25) పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు మీనా మూడోసారి గర్భిణిగా ఉండగా నెలలు నిండడంతో గూడూరులోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు ఆమెకు సీజేరియన్ చేసి పండంటి మగ్గబిడ్డను బయటకు తీశారు. అయితే ఆ సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను వైద్యులు, సిబ్బంది, 108 వాహనంలో నెల్లూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అటు తరువాత ఆమె మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు చిన్న బిడ్డలను పెట్టుకుని ఎలా జీవించాలని ఆమె భర్త కుడుముల అంకయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. బాలింత మృతి చెందడంపై చిల్లకూరు వైద్యుడు అరాఫత్‌ను వివరణ కోరగా మీనా మరణంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరువాతే విషయం తెలుస్తుందన్నారు.
గాయపడిన కార్మికుడి మృతి
రేణిగుంట: మండలంలోని గాజులమండ్యం పారిశ్రామిక వాడలోని క్రోమో మెడికేర్ కంపెనీలో ఈనెల 14వ తేదీ రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు కార్మికులకు చైన్నె ప్రైవేట్ వైద్యశాలలో వైద్యం అందిస్తుండగా చిట్టమూరు మండలానికి చెందిన వెంకటేష్ శనివారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి ఆదివారం బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్లు గాజుల మండ్యం పోలీసులు తెలిపారు. మరో కార్మికుడు రవీంద్ర పరిస్థితి విషమంగా ఉందనే సమాచారం.