
పీడీపై కఠిన చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్
కోట : కోట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బాలికలపై జరిగిన దాడి ఘటన సమాజం సిగ్గుపడేలా చేసిందని, ఈ దారుణానికి బాధ్యుడైన వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్‌ను విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్విత్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం ఎస్సీ బాలికల వసతి గృహానికి విచ్చేసి జరిగిన సంఘటనపై బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యూనిఫామ్ వేసుకురాలేదనే కారణంతో ఒక్కొక్కరి చేత 120 గుంజిళ్లు తీయించాడని, గుంజిళ్లు తీయని వారిని బెత్తంతో కొట్టారని, బాలికలు తమ సామాజిక సమస్యలు ఉన్నాయని ప్రాధేయపడ్డా కనికరించలేదని వాపోయారు. గుండెల్లో నొప్పిగా ఉందని ఒక బాలిక కాళ్లు పట్టుకున్నా వినలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అశ్విత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ బాలికలపై జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్ విచారణ జరిపి పీఈటీతో పాటు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గారా వంశీ, మధు, సన్నీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎంబేటి గిరి, మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంధ్ర, పెంచలయ్య, రాజేష్ పాల్గొన్నారు.
పీడీపై కేసు నమోదు
కోట బాలికల జెడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ అలియాస్ మాబాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఎస్సీ బాలికల వసతిగృహం విద్యార్థినులకు యూనిఫామ్‌లో హాజరు కాని కారణంగా గుంజిళ్లు తీయించి అస్వస్థతకు కారణమయ్యారు. బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.