సైదాపురం : మైనింగ్ సరిహద్దుల వివాదంపై శుక్రవారం ఉన్నతాధికారులు సర్వే చేపట్టారు. జిల్లా సర్వేయర్ రఘరామరాజు, సైదాపురం ఇన్‌చార్జి సర్వేయర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మండలంలోని పొక్కందల గ్రామ సమీపంలోని 95 సర్వేలో ఉన్న వివాదాస్పదమైన మైనింగ్ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వివరాలు ఇలా .. మండలంలోని పొక్కందల గ్రామంలోని సర్వే నంబర్‌లో సుమారు 200 ఎకరాల ఉమ్మడి భూమి ఉంది. ఈ భూముల్లో గతంలో మైనింగ్ లీజులు ఉండేవి. ప్రస్తుతం ముగ్గురికి ఆ భూములకు సంబంధించి మైనింగ్ లీజులు ఉన్నాయి. ఇద్దరు మైనింగ్ యజమానుల మధ్య భూ వివాదం ఏర్పడింది. దీంతో కొంత కాలం నుంచి తీవ్ర స్థాయిలో సరిహద్దులతో పాటు తమ భూములను ఓ యజమాని ఆక్రమించారంటూ ఉన్నతాఽధికారులతో పాటు కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం జిల్లా సర్వే అధికారుల పర్యవేక్షణలో ఆ భూములకు సంబంధించిన రికార్డులతో పాటు హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఐసీడీఎస్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : ఐసీడీఎస్ పరిధిలో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పీడీ వసంత బాయి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, కోటలోని చిల్ట్రన్ హోమ్స్‌లో కుక్, నైట్ వాచ్‌మెన్, హౌస్ కీపర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ యోగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పోస్టు ద్వారా లేదా కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్హత వివరాలు ఐసీడీఎస్ వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. వయస్సు 30 నుంచి 45 లోపు వారు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తుకు ఓసీలు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.200 డీడీ లేదా బ్యాంక్ చెక్కు రూపంలో ఇవ్వాలని తెలియజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం విమాన, రక్షణ శాఖ గౌరవ సలహాదారుడు డాక్టర్ సతీష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.