
క్షేత్ర సహాయకుడిపై హత్యాయత్నం
రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న నవీన్‌పై బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అర్బన్ సీఐ జయచంద్ర, ఎస్‌ఐ అరుణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అర్బన్ పోలీసుల కథనం మేరకు.. కరకంబాడి పంచాయతీ పరిధిలోని దొడ్ల మిట్టలో నివాసం ఉంటున్న నవీన్ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు నవీన్‌తో పలుమార్లు ఘర్షణ పడినట్లు తెలిపారు. అందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నవీన్ నూతనంగా రిలీజ్ అయిన ఓ సినిమాకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి బెడ్ రూమ్‌లో కిటికీ తీసి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన నవీన్ కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా నిప్పు పెట్టి వెళుతున్న వారిని గుర్తించాడు. ఘటనపై అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు నవీన్ మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకే ఇంటికి నిప్పు పెట్టారని , రామాంజనేయులు, ఆదినారాయణ, అనురాధ ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధం అనుమానమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.