
వేధిస్తున్న డ్రైవర్ల కొరత
డ్రైవర్లకు అందని వేతనాలు
మూలనపడిన ఎక్స్‌ప్రెస్ వాహనాలు
తిరుపతి తుడా: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థకు చంద్ర గ్రహణం పట్టింది. పాడైన ఎక్స్‌ప్రెస్ వాహనాలు, డ్రైవర్ల కొరత, చాలీచాలని వేతనాలు, ఆపై వేతనాల చెల్లింపులో అలసత్వం తదితర సమస్యలతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తల్లీబిడ్డ సురక్షితంగా ఇళ్లకు చేరడం అసాధ్యంగా మారింది. ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లపై దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వేధిస్తున్న డ్రైవర్ల కొరత
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నడిపేందుకు సరిపడా డ్రైవర్లు లేరు. దీంతో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 29 వాహనాలు ఉండగా కేవలం 18 మంది మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. డ్రైవర్లకు చెల్లించే వేతనాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఒకటి రెండు నెలలకే డ్రైవర్లు నిలిచిపోతున్నారు. దీంతో తరచూ డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఉన్న డ్రైవర్లపై పనిఒత్తిడి పెరుగుతోంది. ఒక డ్రైవర్‌కి నెలకు రూ.8 వేల లోపే వస్తుండడంతో ఆవైపు మొగ్గు చూపడం లేదు. కనీసం రూ. 15 వేలు ఇవ్వకుంటే డ్యూటీలు చేయ లేమంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, పని ఒత్తిడితో సతమతమవుతున్నామని వారు తమ గోడును వెళ్లబోసుకున్నా రు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
వాహనాలు షెడ్డుకే పరిమితం
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు చిన్నచిన్న రిపేర్లు రావడంతో మొరాయిస్తున్నాయి. దీంతో అవి మరమ్మతులకు నోచుకోక షెడ్డుకే పరిమితం అవుతున్నాయి. ఉన్న ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఎక్కితే తల్లీబిడ్డలు సురక్షితంగా ఇళ్లకు చేరుతామా? లేదా అన్న భయం నెలకొంది. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సెల్లార్‌లో 8 వాహనాలు రిపేర్లతో మూలనపడ్డాయి. ఇం.ఇన్ నుంచి ఆయిల్ లీక్, టైర్లు అరిగిపోవడం వంటి ఇతర మరమ్మతులకు గురైన ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయి. నిర్వహణ లోపంతో వాహనాలు కండిషన్‌లో లేవని డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఈ వాహనాల్లో తల్లీబిడ్డను ఇళ్లకు చేర్చడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లీబిడ్డలకు అవస్థల ప్రయాణం
డ్రైవర్లు, వాహనాల కొరత కారణంగా ఉదయం పూట డిశ్చార్జ్ అయినా మధ్యాహ్నం తరువాత డిశ్చార్జ్ అయిన తల్లీబిడ్డలను ఒకేసారి ఒక్కొక్క వాహనంలో ఇద్దరు లేదా ముగ్గురిని తరలిస్తున్నారు. దీంతో వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వాహన డ్రైవర్లకు వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారు వాహనంలో ప్రయాణించిన బాలింతల బంధువులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా పలు రకాల అవస్థలు భరించలేక తల్లీబిడ్డలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి, ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సి వస్తోంది.
డ్రైవర్ల వేతనాల చెల్లింపులో అలసత్వం
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు నడపడానికి డ్రైవర్లు అసలే అరకొరగా ఉన్నారు. వారికి ఇచ్చే వేతనాలు చాలీచాలకుండా ఉన్నాయి. వాటి చెల్లింపులోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నెలనెలా జీతాలు అందకపోవడంతో పనిచేస్తున్న డ్రైవర్లు అవస్థ పడుతున్నారు. 4 నెలలుగా వేతనం అందకపోవడంతో ఉన్న డ్రైవర్లు సైతం విధులు నిర్వహించడానికి సుముఖత చూపడం లేదు. ఫలితంగా తల్లీబిడ్డ క్షేమంగా ఇల్లు చేరడం కష్టం అవుతోంది. దీంతో బాలింతలు, వారి బంధువులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.